Modi Foreign Tour | ఇండియా-నార్వే సంబంధాలకు కొత్త దిశ

Modi Foreign Tour | ఇండియా-నార్వే సంబంధాలకు కొత్త దిశ
Modi Foreign Tour | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ పాత్రకు నార్వే ప్రశంసలు
అంతర్జాతీయ చట్టాలపై నార్వే ప్రధాని స్పష్టమైన వ్యాఖ్యలు
మోడీ పర్యటనలో విదేశీ జర్నలిస్టుల వివాదాస్పద ప్రశ్నలు
భారత ప్రజాస్వామ్యం, విదేశాంగ విధానంపై గట్టిగా స్పందించిన భారత్
Modi Foreign Tour | ప్రధానమంత్రి మోడీ నార్వే పర్యటన విజయవంతంగా ముగిసిందనే భావించవచ్చు! నార్వే దేశ ప్రధాన మంత్రి జోనాస్ ఘర్ స్టోర్ ఓస్లో రాజధానిలో, ప్రెస్ వారి సమావేశంలో మాట్లాడుతూ “యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని విరమింప చేయటానికి ప్రధాని మోడీ, రష్యాతో తనకున్న సామరస్య సంబంధాలతో దౌత్యపరంగా ప్రయత్నాలు చేయటానికి అవకాశాలున్నాయి” అని చెప్పటం గమనార్హం! నార్వే దేశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విషయంలో అంతగా ఆరాటపడటానికి కారణం ఉంది! యుక్రెయిన్ కోసం నార్వే గవర్నమెంట్ ఒక ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దానితో పాటు రష్యా విషయంలో కట్టుబాట్లు విధించాలని కూడా కోరింది!
అయితే నార్వే ప్రధాని, ప్రధాని మోడీ సమక్షంలోనే మరో విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. యు.ఎస్., ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌ను ఆక్రమించటానికి పూనుకోవటం అంతర్జాతీయ చట్టప్రకారం లేదు! వెనుజులాను యు.ఎస్ ఆక్రమించుకోటానికి పూనుకోవటం కూడా సమంజసం కాదు. గ్రీన్‌లాండ్ విషయంలో కూడా “ఆ దేశ భూభాగాన్ని క్లెయిమ్ చేస్తున్నాను” అని యు.ఎస్ అనటం కూడా సమంజసం కాదు. మా దేశం ఎప్పటికీ ద్వంద్వ విధానాన్ని ఒప్పుకోదు! ముఖ్యంగా ఇజ్రాయిల్ నడవడిక, వందల కొద్దీ పాలస్తీనియన్లను గాజాలో హతమార్చటం అందరూ ఖండించాల్సిందే! యూరప్ దేశాల మాదిరి “డబుల్ స్టాండర్డ్స్” నార్వే అవలంబించదు! అంతర్జాతీయ చట్టం అన్ని దేశాల ప్రజలకూ, అన్నిచోట్లా ఎల్లప్పుడూ వర్తించక తప్పదు! ఆ సూత్రాన్ని మా దేశం నిస్సందేహంగా విశ్వసిస్తున్నది.
నార్వే ప్రధాని తమ విదేశాంగ విధానాలను ఆ విధంగా చెప్పటం నిజంగా హర్షణీయం. అదీ ప్రధాని మోడీ పర్యటనలో ప్రెస్ వారికి క్లారిటీతో చెప్పటం, ఆ ప్రధాని నిజాయితీని తేటతెల్లం చేస్తున్నది! నార్వే ప్రధాని అంతర్జాతీయ సంబంధాల గురించి వివరంగా చెప్పటంతో పాటు ఇండియా నార్వే, ఇతర దేశాల మీద ఎక్కువగా ఆధారపడకుండా వాణిజ్యం, సాంకేతికత, రిన్యూవబుల్ ఎనర్జీ విషయాలలో మరింతగా సహకరించుకొని ప్రగతి సాధించుకోవాలని నార్వే విదేశాంగ మంత్రి అనటం కూడా పరిగణనలోకి తీసుకోవాలి!
నార్వే ప్రధాని, “ఇండియా చమురు విషయంలో రష్యా మీద తక్కువగా ఆధారపడితే యుక్రెయిన్ పరిస్థితుల్లో మార్పు తేవచ్చు” అని భావిస్తున్నారు. “అయితే మా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి గానీ మార్పు అంత త్వరగా సంభవించదు. ‘ఎనర్జీ ట్రాన్సిషన్’ విషయంలో ఇరు దేశాలు పార్ట్‌నర్స్‌గా ఉండాలని అభిలషిస్తున్నాను. హర్మోజ్ స్ట్రెయిట్ మూసివేయటం వల్ల ఇండియాకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఖతార్ లాంటి దేశాల నుంచి వచ్చే చమురు దిగుమతి ఆగిపోవటంతో ఫ్యుయెల్, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్ ఆయిల్ సప్లై నార్వే చేయగలిగితే రష్యా మీద ఇండియా ఆధారపడటం తక్కువ అవుతుంది!” అని కూడా స్పష్టపరచటం విశేషం!

“రష్యా-ఉక్రెయిన్ విషయంలో అవలంభించే విధానాలు నచ్చకనే యు.ఎస్‌తోపాటు యూరప్ దేశాలు రష్యా మీద సాంక్షన్లు విధించాం! వాటిని సడలించటం నార్వేకు నచ్చదు! ఉక్రెయిన్ మీద రష్యా బరితెగించి ఆక్రమణలకు పాల్పడటం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లే! అది ముమ్మాటికీ మేము ఒప్పుకోం! ఈ విషయంలో ఇండియాకు రష్యాతో ఉన్న సంబంధాల దృష్ట్యా, రష్యా పాలసీలో ఇండియా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తే మేము హర్షిస్తాం! ఆ మార్గంలో ఇండియా మాకు సహాయకారిగా ఉండాలని కోరుకుంటున్నాం! కొన్ని సమస్యల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్న మాట నిజం! కానీ నార్వే-ఇండియాల స్నేహ సంబంధాలకు అవి ఏమాత్రం అడ్డు రావు” అని చెప్పటం జరిగింది!
ఎనిమిది దేశాలు — కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, యు.ఎస్.ఏ మరియు ఇండియా కలిసి “ఆర్క్టిక్ కౌన్సిల్”ను ఏర్పాటు చేసుకున్నారు. ఇండియాకు ఆ గ్రూప్‌లో శాశ్వత సభ్యత్వం కూడా ఉంది! ఈ కౌన్సిల్ ట్రేడ్ రూట్స్, వాతావరణ మార్పులు, ఓషియన్ మేనేజ్‌మెంట్ విషయాలలో 2013 నుంచి చర్చలు జరుపుతున్నది. మరి మారుతున్న పరిస్థితుల్లో ఇండియా కౌన్సిల్‌లో ఉంటుందా? అని ప్రెస్ వారు అడిగినప్పుడు నార్వే ప్రధాని “నిజానికి ఇండియా సైన్స్, ఆర్క్టిక్ వాతావరణ విషయాల్లో ఉన్న లోతైన అవగాహనతో రీసెర్చ్ ప్రోగ్రాంలో కూడా ఇండియా పాల్గొనటాన్ని నార్వే అభిలషిస్తున్నది” అని చెప్పటం ఇండియా మీద నార్వే దేశానికి ఉన్న గౌరవాన్ని చెప్పకనే చెప్పినట్లే!
ప్రధానమంత్రి ఇండియా పర్యటన నార్వేలో సజావుగా సాగటమే కాదు బాగా విజయవంతం అయింది అని కూడా చెప్పొచ్చు! కానీ పానకంలో పుడకలా హెల్లీల్వింగ్ స్వెండ్స్ అనే మహిళా జర్నలిస్టు దాదాపు మోడీ విజయవంతమైన పర్యటనను దెబ్బతీయటానికి ప్రయత్నించటం అందర్నీ ఆశ్చర్యపర్చింది!
నరేంద్ర మోడీ యూరప్ పర్యటనలో ప్రెస్ వారు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వకూడదని మొదటే నిర్ణయించుకోవటం జరిగింది! బహుశా దురుద్దేశ్యాలతో సంధించే ప్రశ్నలను పట్టించుకోకుండా ఉండటమే మంచిది అని ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్త వాతావరణంలో నిర్ణయించుకొని ఉండొచ్చు! మన దేశంలో కూడా ప్రధాని మోడీ “ప్రెస్ మీట్స్”ను ఇష్టపడరు. దాదాపు మోడీ ప్రెస్ కాన్ఫరెన్సులు ఆయన ప్రధానిగా అయిన తర్వాత చాలా తక్కువగా జరిగి ఉండొచ్చు! ప్రజలకు చేరాల్సిన విషయాలను “మన్ కీ బాత్” లాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా, పిచ్చాపాటిగా అదీ చాలా అరుదుగా జరిగే ఇన్ఫార్మల్ సంభాషణల ద్వారా తెలియపర్చటం మన దేశంలో కూడా చూస్తున్నాం! అలాంటిది ఆ మహిళా జర్నలిస్టు సభ్యత, సంస్కారాన్ని గాలికి వదిలేసి “ప్రెస్ ఫ్రీడమ్” బురఖాలో కావాలనే ప్రధానిని ఇబ్బంది పెట్టి తను ప్రాచుర్యం గడించాలని ప్రయత్నించింది!
జాయింట్ ప్రెస్ సమావేశంలో ఆ నార్వేయన్ మహిళా జర్నలిస్టు మీడియా ప్రశ్నలకు మీరు ఎందుకు జవాబు ఇవ్వరు? యూరోపియన్ దేశంలో అది ఒక ఆనవాయితీ! అని అడగటంతో అందరూ అవాక్కయ్యారు. అదే రోజున మన విదేశాంగ శాఖ ప్రతినిధులను కూడా బాహాటంగా ప్రశ్నించింది. మానవ హక్కులు ఉల్లంఘించటమే అన్నట్లు తప్పుపట్టే ప్రయత్నం చేసినప్పుడు “మాది నాగరికత కలిగిన దేశం” అని మన ప్రతినిధులు సున్నితంగా తప్పుకున్నారు! అంతేగాదు “ఇదేమిటీ-అదేమిటి” అని అనేక మంది అడగటం చూస్తూనే ఉన్నాం! మొత్తం ప్రపంచంలోని జనాభాలో మా దేశ జనాభా 1/6 నిష్పత్తిలో ఉంటుంది. కానీ 1/6 వంతు ప్రపంచ సమస్యల్లో కాదు” అని ఖండితంగా బదులు ఇవ్వటం గమనార్హం! “మా దేశ రాజ్యాంగం ప్రాథమిక హక్కులనూ, మహిళలకు సమాన హక్కులనూ ఇవ్వటమే కాదు అమలు చేస్తున్నది. అది చాలా ముఖ్యం” అని కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి సి.బి. జార్జి కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంతో ఆ జర్నలిస్టు విసురుగా సమావేశం వదిలి వెళ్లింది!
ఆ జర్నలిస్టే ఉదయపు జాయింట్ ప్రెస్ మీట్‌లో “మీరు ఎందుకు ప్రశ్నలకు జవాబులు ఇవ్వరు?” అంటూ మోడీ వెంటనే నడుస్తూ “మా దేశ విశ్వాసం పొందే…” అని వ్యాఖ్యాన్ని పూర్తిచేయలేదు. ఆమె ఉద్దేశ్యం విశ్వాసం పొందే హక్కు లేదని! ఇండియా-నోర్డిక్ సమావేశంలో మోడీ అడ్రెస్ చేశారు కానీ సమావేశం తర్వాత ప్రెస్ వారి ప్రశ్నలు తీసుకోలేదు. నార్వే ప్రధాని మాత్రం “ఇండియా సంప్రదాయాలు విభిన్నంగా ఉండొచ్చు. మనం గౌరవించాలి” అని సమావేశం ముగించారు.
నెదర్లాండ్స్ పర్యటనలో కూడా ఇదే ఇబ్బంది ప్రధాని ఎదుర్కొన్నారు. జార్జి ప్రెస్ మీట్‌లో అదే విషయాన్ని లేవనెత్తారు! “సమస్యల అవగాహన అడిగేవారికి లేకపోవటం వల్ల సమస్య తలెత్తుతున్నది. ఇండియా సాధించిన చారిత్రాత్మక ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రికార్డు మీకు తెలియదు” అని ఖండితంగా చెప్పారు!
యూరప్ దేశాల పర్యటనల్లో ఇలాంటి ఇబ్బందులు ప్రధానికి కావాలనే సృష్టించారు! గౌరవ ప్రతిపత్తులు ఇచ్చిపుచ్చుకోవటం, విదేశీయ జర్నలిస్టులు మధ్య మర్చిపోయి కేవలం కీర్తికండూతితో స్వీయ ప్రాచుర్యాన్వేషణలో ఇలాంటి ప్రక్కదారులు తొక్కడం ఇండియా ప్రక్కకు నెట్టేయటమే మంచిది! అదే మన విదేశాంగ శాఖ చేసింది! సంఘటనల వల్ల సంబంధిత దేశాలు ఇరుకున పడ్డాయి ఆ జర్నలిస్టుల ప్రవర్తన వల్ల! కానీ మన దేశం దేశాల మధ్య సత్సంబంధాలను ఇనుమడింప చేస్తూ గౌరవాన్ని దక్కించుకుంది.
రావులపాటి సీతారాంరావు
