ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై మండిపడ్డ జనసేన నాయకులు

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై మండిపడ్డ జనసేన నాయకులు
భవానిపురం, ఆంధ్రప్రభ :
జనసేన పార్టీపై, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై, మంత్రి నాదెండ్ల మనోహర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పార్టీ పీఏసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్, నెరుసు కృష్ణాంజనేయులు, రుద్ర శేఖర్ నాయుడు, మద్దిల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు వారు మీడియాతో మాట్లాడారు.
మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగజారి జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీకి పూర్తి అనుకూలంగా మాట్లాడుతూ అది తన విశ్లేషణ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు సంపాదించి, కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి సుమారు 16 నెలలు పైగా జైల్లో ఉన్న వ్యక్తికి అనుకూలంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా, ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోతిరెడ్డి రమణ, 63వ డివిజన్ జనసేన అధ్యక్షులు చిగుళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
