గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యం

గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యం

  • అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు: ఎస్సై ప్రశాంత్

నస్పూర్, ఆంధ్రప్రభ:
గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్స్ వింగ్ , మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీసులు సమన్వయంతో గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నస్పూర్ ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి.

ముఖ్యంగా సీసీసీ కార్నర్ ప్రాంతం, ఆటో స్టాండ్ పరిసరాలు, సమీప హోటళ్లు, పాన్ షాపులు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు, హోటళ్ల పరిసరాలు, పాన్ డబ్బాలతో పాటు పలు అనుమానాస్పద ప్రదేశాలను నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.

అనంతరం ప్రజలకు గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.

Leave a Reply