ముఖ్యమంత్రి పర్యటనకు చిత్తూరు పోలీసుల పటిష్ట భద్రత

ముఖ్యమంత్రి పర్యటనకు చిత్తూరు పోలీసుల పటిష్ట భద్రత
- యాదమరిలో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ కార్యక్రమం నిర్వహణ
- హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల పరిశీలన
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23న చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి గురువారం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, సభా ప్రాంగణం, యాదమరి హెల్త్ కేర్ యూనిట్, ప్రజల పార్కింగ్ స్థలాలు, వీఐపీ పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, బారికేడింగ్, వైద్య సేవలు, రూట్ మ్యాప్ అందుబాటు, ట్రాఫిక్ నియంత్రణ, జనసామూహిక నియంత్రణ చర్యలపై ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల వాహనాల పార్కింగ్, వీఐపీ వాహనాల పార్కింగ్ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సంజీవని ప్రాజెక్టు ఏర్పాటు చేసిన యాదమరి హెల్త్ కేర్ సెంటర్‌తో పాటు సభా ప్రాంగణాన్ని ప్రత్యేక భద్రతా ప్రాంతాలుగా గుర్తించి సమగ్ర పరిశీలన నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.
ఫైర్ సర్వీసులు, ఆరోగ్య శాఖ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పోలీసు బందోబస్తు, డ్రోన్ మానిటరింగ్, వీఐపీ మూమెంట్స్, ప్రజల రాకపోకలు, పార్కింగ్ నిర్వహణ వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి స్థాయిలో అధికారులు అప్రమత్తంగా పనిచేస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, చిత్తూరు ఎస్డీపీవో జె. వెంకటనారాయణ, ఫైర్ అధికారులు, ఎమ్మార్వో, యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య, ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.

