tn chief minister | వారికి రూ.లక్ష రివార్డ్

tn chief minister | వారికి రూ.లక్ష రివార్డ్
tn chief minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జోసెఫ్ విజయ్ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో తమిళగ వెట్రి కజగం పార్టీ ఇచ్చిన ‘జీరో కరప్షన్’ హామీ అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారుల వివరాలను వీడియో ఆధారాలతో పట్టిస్తే, ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా లక్ష రూపాయల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు, అవినీతి ఎదురైతే ప్రజలు నేరుగా సీఎంఓకు ఫిర్యాదు చేసేలా ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్, హెల్ప్‌లైన్ వ్యవస్థను తీసుకురావడానికి తమిళనాడు ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీవో ఆఫీసులు, మున్సిపల్ శాఖలు, రేషన్ కార్డు విభాగాల్లో అవినీతిని పూర్తిగా అరికట్టాలని సీఎం విజయ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
లంచం అడిగినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే ఎంతటి ఉన్నతాధికారి అయినా, పార్టీకి సన్నిహితులైనా సరే ఉపేక్షించబోమని సీఎంఓ వర్గాలు హెచ్చరించాయి. సంబంధిత అధికారులపై తక్షణమే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన విచారణ కూడా చేపడతామని స్పష్టం చేశాయి. దీంతో తమిళనాడులో అవినీతి నిర్మూలనపై విజయ్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.
