Andhra Pradesh population policy | పాపులేషన్ మేనేజ్మెంట్తో సంపద సృష్టికి అవకాశం

Andhra Pradesh population policy | పాపులేషన్ మేనేజ్మెంట్తో సంపద సృష్టికి అవకాశం
Andhra Pradesh population policy | ఫెర్టిలిటీ రేటు పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం
మూడో, నాల్గో బిడ్డలకు ప్రోత్సాహకాలు
ప్రపంచ దేశాల్లో జనాభా సంక్షోభం ఉదాహరణలు
ఆర్థికాభివృద్ధికి జనాభా సమతుల్యత కీలకం
Andhra Pradesh population policy | అమరావతి, ఆంధ్రప్రభ: ప్రజలే మన సంపద.. వారే మన భవిష్యత్తు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త జనాభా నిర్వహణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్) భవిష్యత్తులో తీవ్ర మానవ వనరుల కొరతకు, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జనాభా వృద్ధిని ప్రోత్సహించేలా పిల్లలే సంపద అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 5వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా ఆధారంగా ఈ సరికొత్త విధానంపై మరింతగా లోతుగా చర్చించి అందరి అభిప్రాయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నదే కూటమి సర్కారు ఆలోచన.
ఈ కొత్త విధానంలో భాగంగా ఇకపై జనాభా నియంత్రణకు బదులు, జనాభా వృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడో బిడ్డకు జన్మనిస్తే రూ. 30 వేలు, నాల్గవ బిడ్డకు రూ. 40 వేల చొప్పున ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
జాతీయ సగటు కంటే ఫెర్టిలిటీ రేటులో వెనుక ఉన్న ఏపీ.. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏపీ జనాభా పరంగా 10వ స్థానంలో, వైశాల్యం పరంగా 7వ స్థానంలో ఉంది. రాష్ట్ర జనసాంద్రతలో మాత్రం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది. దేశంలో ప్రతి చదరపు కిలో మీటరు పరిధిలో సగటున 382 మంది నివసిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో ఆ సంఖ్య కేవలం 304 మాత్రంగానే ఉంది. రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ (టీఎఫ్ ఆర్) గతంలో 2.10 ఉండగా, అది ఇప్పుడు 1.50కి పడిపోయింది. దేశ సగటు ఫెర్టిలిటీ రేట్ 1.9 గా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఈ అంశంలో చాలా వెనుకబడి ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, కడప జిల్లాలో గరిష్టంగా 1.99 ఫెర్టిలిటీ రేట్ నమోదు కాగా, పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో అత్యల్పంగా 1.32 మాత్రమే నమోదైంది.
అలాగే ఏలూరు జిల్లాలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.53గానే ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఫెర్టిలిటీ రేటులో ముందంజలో ఉన్నాయి. గత 30 ఏళ్లుగా అమలైన కుటుంబ నియంత్రణ చర్యల వల్ల ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు గణనీయంగా క్షీణించింది.
గతంలో రాష్ట్రంలో పేదరికం, వనరుల కొరతను దృష్టిలో ఉంచుకుని కుటుంబ నియంత్రణను ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఒక్కరు ముద్దు-ఇద్దరు హద్దు అంటూ నాడు ప్రచారం నిర్వహించాయి. ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ అత్యవసరమని కూటమి సర్కారు భావిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంక్షోభం..
ఒకప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను అంతర్జాతీయ సమాజం తక్కువ చేసి చూసేది. కానీ, కఠినమైన జనాభా నియంత్రణ విధానాలను అవలంబించిన చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జర్మనీ వంటి దేశాలు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. నిర్బంధంగా ఒక్కరే ముద్దు విధానాన్ని అమలు చేసిన చైనాలో ప్రస్తుతం యువశక్తి తగ్గిపోయి, ఆర్థిక ఉత్పాదకత కుప్పకూలింది. పెరుగుతున్న వృద్ధుల సంఖ్య ఆయా దేశాలకు భారం కావడంతో, అనేక దేశాలు ఓల్డేజ్ హోంలుగా మారుతున్నాయి.
కొన్ని దేశాల్లో ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతుండటంతో, తమ ప్రాంతాలకు వచ్చి నివసిస్తే ఉచిత వసతి, ఉద్యోగంతో పాటు ఎదురు డబ్బులు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం పిల్లలే సంపద పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కారు భావిస్తోంది. జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో వర్క్ ఫోర్స్ కొరత కారణంగా అభివృద్ధికి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలను ఇప్పటి నుంచే మొదలు పెట్టేలా ఈ కార్యాచరణ చేపట్టింది. ఆర్థిక ప్రగతి, సమాజంలో సమతుల్యత కోసం జనాభా వృద్ధి తప్పనిసరి అనేది ప్రజా ప్రభుత్వం అభిప్రాయంగా కన్పిస్తోంది.
