ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తెలంగాణ

ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తెలంగాణ
- రూ.650 కోట్లతో కేజేఎస్ ఇండియా యూనిట్–II కు శంకుస్థాపన
- తొగర్‌పల్లిలో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
- ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి
- వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలే ప్రభుత్వ లక్ష్యం: మంత్రులు
సంగారెడ్డి ప్రతినిధి,ఆంధ్రప్రభ: తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి శివారులో కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్–II కు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా సుమారు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌లు ఏర్పాటుకానున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్‌గా..
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. జహీరాబాద్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని నిమ్జ్‌ను అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్‌గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
65 శాతం పైగా యువత నైపుణ్యాలను వినియోగించుకొని తెలంగాణను మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను గుర్తించి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ దేశంలో అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా నిలిచిందని, పాలు, పండ్లు, కూరగాయలు, పసుపు వంటి ఉత్పత్తుల్లో కూడా ముందంజలో ఉందన్నారు. ఈ ఉత్పత్తులకు విలువను పెంచే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రైతులకు, యువతకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.
పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పటాన్‌చెరు గుర్తింపు పొందిందన్నారు. అదే తరహాలో వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. మెదక్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన పారిశ్రామిక ప్రోత్సాహక చర్యలే కారణమన్నారు.
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పరిశ్రమల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల ద్వారా మారుమూల గ్రామాలు కూడా పట్టణాల స్థాయిలో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, అందులో 1000 మంది మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తెలంగాణ టీజీ ఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పరిశ్రమల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల ద్వారా మారుమూల గ్రామాలు కూడా పట్టణాల స్థాయిలో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, అందులో 1000 మంది మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసీ ఎండీ శశాంక, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి, కంపెనీ చైర్మన్ గిరీష్ జైన్, ఎండీ పీపీ రాంకా తదితరులు పాల్గొన్నారు.
