అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్టు

అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్టు

కళ్యాణ మండపాలు లక్ష్యంగా చేసుకుని చోరీలు
3.9 కిలోల గంజాయి, 52.8 గ్రాముల బంగారు స్వాధీనం
అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ

కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు, చోరీలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లాలో గంజాయి విక్రయాలపై నిఘా పెట్టడంతో పలు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేస్తున్నారు. కళ్యాణ మండపాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు. కళ్యాణ మండపాలను, ఫంక్షన్ హాల్స్ను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినరితేష్ సిసోరియా, అనికేష్ కుమార్ సాస్సిని పెనమలూరు, కానూరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని కళ్యాణ వేడుకల్లో చోరీలు జరిగినట్లు తమ దృష్టికి రావటంతో ప్రత్యేకంగా నిఘా పెట్టి వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 20 సంవత్సరాల వయస్సు గల రితేష్ సిసోరియా, అనికేష్ కుమార్ సాస్సిని కానూరులో బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

వారి వద్ద నుంచి 3.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటంతోపాటు 52.8 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, రూ.3.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజమండ్రి, విశాఖపట్నంలో కూడా దొంగతనాలు చేసినట్లు తెలిసిందని తెలిపారు. వీరి వద్ద నుంచి గ్యాంగ్ సభ్యుల డిటేల్స్ తీసుకుని ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ను పంపించినట్లు ఎస్పీ తెలిపారు..

అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

అనుమానాస్పద వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కళ్యాణ వేడుకలకు, ఇతర శుభకార్యాలకు కొత్త వ్యక్తులు వచ్చిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు దొంగలు సామాన్య వ్యక్తులుగా వచ్చి దుస్తులు మార్చుకున్నట్లు నటించి నగదు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనుమానంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, గంజాయిపై, దొంగతనాలను అరికట్టడంతో జిల్లాలు అప్రమత్తంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

Leave a Reply