పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు…

పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు…
రూ.1.21 కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ…..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలోని బృందం కార్యాలయానికి చేరుకుని పలు కీలక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీలో రూ. 1,21,66,859/- (ఒక కోటి 21 లక్షల 66 వేల 859 రూపాయలు) నిధులు దుర్వినియోగం అయినట్లు గతంలోనే జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), జిల్లా కలెక్టర్‌కు నివేదికలు అందాయి.
ఈ నిధుల అవకతవకలపై జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు మాజీ గ్రామపంచాయతీ 14వ వార్డు సభ్యుడు లగడపాటి ప్రవీణ్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదును ప్రాథమికంగా విచారించిన డివిజనల్ పంచాయతీ అధికారి ( డి ఎల్ పి ఓ ) జి.ఎల్.ఎన్.వి. రాఘవన్.. నిధులు దుర్వినియోగం నిజమేనని నిర్ధారిస్తూ గతంలో నివేదిక సమర్పించారు. ఈ నివేదికల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం పంచాయతీ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
రికార్డుల స్వాధీనం – విచారణ..
ఏసీబీ సీఐ సత్యనారాయణ నేతృత్వంలో అధికారులు పంచాయతీ రికార్డులను, నగదు పుస్తకాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిధులు ఎక్కడెక్కడ పక్కదారి పట్టాయనే కోణంలో వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో డి ఎల్ పి ఓ జి.ఎల్.ఎన్.వి. రాఘవన్, పంచాయతీ కార్యదర్శి జి. శ్యామ్ కుమార్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కె.వి. సుబ్బారావు, ఫిర్యాదుదారుడు లగడపాటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడి జరగడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
