శాంతిభద్రతల పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలి

శాంతిభద్రతల పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలి
- ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా, చెక్‌పోస్టుల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, గోవుల అక్రమ రవాణా నివారణ, ధాన్యం కొనుగోలు, ధాన్యం అక్రమ రవాణా నియంత్రణ వంటి అంశాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ ఇతర శాఖలతో పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణా నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా 9 చెక్‌పోస్టులను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
బక్రీద్ సందర్భంగా ఎలాంటి పశువుల అక్రమ రవాణా జరగడానికి వీలులేదని, అదే విధంగా బక్రీద్ సందర్భంగా వ్యర్థాలను నిర్ణీత ప్రదేశాల్లోని గుంతల్లో మాత్రమే వేయాలని, పరిశుభ్రతకు భంగం కలగకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అవసరాన్ని బట్టి రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యాన్ని ఇతర కారణాలతో రాష్ట్రంలో విక్రయించకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ తెలియజేశారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలు, రైతుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.
