Bhagavad Gita Teachings | అదే.. నిజమైన సిద్ధి

Bhagavad Gita Teachings | అదే.. నిజమైన సిద్ధి
Bhagavad Gita Teachings | అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు మానవ ప్రయాణం
విగ్రహారాధన వెనుక ఉన్న అసలైన పరమార్థం
ప్రహ్లాదుడి భక్తి తెలిపిన సర్వవ్యాపకత్వం
తిన్నడి భక్తి ముందు తలవంచిన పరమశివుడు
భావప్రియుడైన భగవంతుడు
బాహ్య పూజ కంటే అంతరంగ పూజే గొప్పది
Bhagavad Gita Teachings | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మానవ జన్మ అనేది కేవలం పుట్టుకతో మొదలై చావుతో ముగిసే భౌతిక ప్రక్రియ కాదు. అది అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగు వైపుకు, పరిమితమైన దేహ భావన నుండి అనంతమైన ఆత్మ స్థితి వైపుకు సాగే ఒక అద్భుతమైన పరిణామ క్రమం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సాధకుడికి ప్రారంభ దశలో కొన్ని బాహ్య ఆలంబనలు, ఆసరా తప్పనిసరి అవుతాయి.
సంసారసాగరంలోని ఆటుపోట్లలో కొట్టుమిట్టాడే సామాన్యుడికి గుడి, గోపురం, విగ్రహం మరియు తీర్థయాత్రలు దైవచింతన నుండి పక్కకు తప్పుకోకుండా కాపాడే రక్షణ కవచాలుగా నిలుస్తాయి. మనసు సహజంగానే బాహ్య ప్రపంచంలోని ఆకర్షణల వైపు, విషయ వాంఛల వైపు పరుగులు తీస్తుంటుంది. ఆ చంచలమైన మనసును ఒకచోట నిలిపి, ఏకాగ్రతను అలవాటు చేయడమే విగ్రహారాధనలోని అసలైన పరమార్థం.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లుగా, భగవంతుడు మన వెలుపల ఎక్కడో కైలాసంలోనో, వైకుంఠంలోనో దాగి లేడు. ఆయన ప్రతి ప్రాణి హృదయ కమలంలో అంతర్యామిగా, నిరంతర సాక్షిగా నివసిస్తున్నాడు. “దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః” అన్న ఆర్యోక్తి ప్రకారం, ఈ దేహమే ఒక పవిత్రమైన ఆలయం, లోపల ఉన్న జీవుడే సనాతనమైన దైవం. మన లోపల వెలుగుతున్న చైతన్యాన్ని గుర్తించి అనుభూతి చెందడమే జ్ఞానం యొక్క పరాకాష్ఠ.
హిరణ్యకశపుడు అహంకారంతో భగవంతుని ఉనికిని శంకించినప్పుడు, ప్రహ్లాదుడు సకల చరాచర సృష్టిలోనూ, ఆఖరికి తన ప్రాణాలను తీయాలనుకునే శత్రువులోనూ, తనలోనూ ఉన్న ఆ ఒక్క పరమాత్మనే దర్శించగలిగాడు. ఆ ‘సర్వవ్యాపకత్వ‘ భావనే, ఆ అచంచలమైన నమ్మకమే నిర్జీవమైన స్తంభం నుండి నరసింహుడిని ఉద్భవించేలా చేసింది. ఇక్కడ స్తంభం అనేది కేవలం ఒక నిమిత్తం మాత్రమే, నిజానికి ప్రహ్లాదుని హృదయంలో వెలిగిన జ్ఞానాగ్ని, అతడి పరిపూర్ణ భక్తియే ఆ పరమాత్మను రప్పించాయి.

అలాగే, బోయవాడైన తిన్నడికి శాస్త్రోక్తమైన పూజా విధులేవీ తెలియవు. శివలింగాన్ని ఎలా అభిషేకించాలో, ఏ మంత్రాలు చదవాలో తెలియని ఆ అమాయక భక్తుడు. కేవలం తన నోటి నీటితోనే స్వామికి అభిషేకం చేశాడు, తాను రుచి చూసిన మాంసాన్నే నైవేద్యంగా పెట్టాడు. లోకం దృష్టిలో అది అపచారం కావచ్చు, కానీ పరమశివుడి దృష్టిలో అది పరమ పవిత్రమైన ప్రేమ. చివరకు దేవుడి కంటి నుండి నీరు కారుతుంటే, ఏమాత్రం సంకోచించకుండా తన కంటినే పీకి సమర్పించిన త్యాగం బాహ్య ఆచారాల కంటే అంతరంగంలోని ఆర్తి ఎంత గొప్పదో నిరూపించింది. శాస్త్రం కంటే ప్రాణం పోసిన భక్తికే ఆ పరమేశ్వరుడు దాసుడయ్యాడు.
నేటి కాలంలో దైవారాధన అనేది దురదృష్టవశాత్తూ ఒక గొప్ప ప్రదర్శనగా, ఆడంబరంగా, పోటీగా మారిపోతోంది. కానీ భగవంతుడు మన ధనానికి, మనం సమర్పించే స్వర్ణాభరణాలకు, అలంకారాలకు మురిసిపోయేవాడు కాదు. ఆయన భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాదు. కేవలం పూజ చేసేటప్పుడు మాత్రమే దేవుడిని తలవడం కాకుండా, చేసే ప్రతి పనినీ దైవ కార్యంగా భావించాలి. ఆత్మజ్ఞానమనే అనంత సముద్రంలో స్వేచ్ఛగా విహరించినప్పుడే, మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి. బాహ్య పూజ అనేది చిత్తశుద్ధిని పెంచే ఒక సాధన మాత్రమే, కానీ అంతరంగంలో జరిగే నిరంతర పూజే ఆ సాధన యొక్క నిజమైన సిద్ధి, సార్థకత!!
K.v.సుమలత
CLICK HERE TO READ 90days | 120 రోజుల ముందుగానే ఆర్జిత సేవల బుకింగ్‌కు అవకాశం..
