వినాయకుని సేవలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్….
వినాయకుని సేవలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్….
కాణిపాకం, ఆంధ్రప్రభ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు ఆదివారం చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ను దర్శించుకున్నారు. జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా కాణిపాకం విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికాయి. ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం వారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో భక్తులు, స్థానిక ప్రజలు ఎన్నికల కమిషనర్‌ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

అంతకుముందు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కాణిపాకం అతిథి గృహానికి చేరుకోగా జిల్లా అధికారులు, పోలీసులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, తిరుపతి జాయింట్ కలెక్టర్, దేవస్థాన ఈవో పెంచల కిషోర్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్య బలోపేతంలో ప్రతి ఓటరు పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. “కుటుంబంలోని ప్రతి ఓటరికి ఇది ఒక కొత్త దినం. విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు ఇది నూతన ఆరంభంగా భావిస్తున్నాను. ప్రతి ఓటరు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వామి కావాలి” అని ఆయన అన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ను దర్శించుకున్నానని, ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో ఈశ్వరుని దర్శించుకున్నానని, అనంతరం కాణిపాకం వచ్చి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పర్యటన నేపథ్యంలో కాణిపాకంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
