సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

తొర్రూరు,ఆంధ్రప్రభ: సెల్‌ఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రులతో గొడవపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతలపల్లి గ్రామానికి చెందిన కమటం కొమరయ్య కుమారుడు కమటం సాయికుమార్ (21) మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల క్రితం తన స్మార్ట్ ఫోన్ కిందపడి పగిలిపోవడంతో, కొత్త ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. బుధవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన సాయికుమార్, ఫోన్ విషయంలో మళ్ళీ గొడవ పడి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

రాత్రి సమయంలో తల్లి సాయమ్మ కుమారుడికి అన్నం పెట్టేందుకు గదిలోకి వెళ్లగా, అక్కడ సాయికుమార్ వెంటిలేషన్‌కు చీరతో ఉరివేసుకొని కనిపించాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం తొర్రూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సాయికుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి కొమరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొర్రూరు ఎస్సై ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందొచ్చిన కొడుకు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply