రసాయన పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు

రసాయన పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు

  • మూడు నెలల్లో మూడు రియాక్టర్ల్ పేలుళ్లు, ఇద్దరు మృతి
  • పదుల సంఖ్యలో క్షతగాత్రులు
  • భద్రతా ప్రమాణాలు గాలికి, తనిఖీలు శూన్యం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల పరిధిలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేయడంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత మూడు నెలల వ్యవధిలోనే మూడు చోట్ల రియాక్టర్లు పేలి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయినా పరిశ్రమలపై కఠిన చర్యలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కార్మిక సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

మూడు నెలల్లో మూడు ఘోరాలు

  1. ఫిబ్రవరి 14: చౌటుప్పల్ డివిజన్‌లోని ఎల్లగిరి గ్రామంలో ఉన్న బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ పేలి భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి.
  2. ఫిబ్రవరి 20: వారం తిరగకుండానే సమీపంలోని దోతిగూడెం గ్రామంలోని విజే సాయి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒక కెమిస్ట్ అక్కడికక్కడే మంటల్లో కాలి మృతి చెందగా, మరికొందరు కార్మికులు గాయపడ్డారు.
  3. మే 1: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బొంగోనిచెరువు గ్రామ సమీపంలోని నోస్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ పేలి ఒక కెమిస్ట్ తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఘటనలో మరో 8 మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారు

రసాయన పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా శాఖల అధికారులు వచ్చి పరిశ్రమల వద్ద హడావుడి చేస్తున్నారు తప్ప ప్రమాదాలకు కారణాలను పరిశీలించడం లేదని, ప్రమాదాల నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలకు, కాలుష్యానికి కారణమైన రసాయన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి అటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండాలని, ఆదిశగా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోని ప్రమాదాలను, కాలుష్యాన్ని నియంత్రించాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు
రసాయన పరిశ్రమలలో తరచుగా పేలుళ్ళు జరుగుతుండడం వల్ల సమీప గ్రామాలలోని ఇండ్లు, గోడలు పగుళ్లు పడుతుండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కాలుష్యం కోరలు – ప్రజారోగ్యంతో చెలగాటం
ప్రమాదాలే కాకుండా ఈ పరిశ్రమలు వాయు, జల కాలుష్యాన్ని విచ్చలవిడిగా విడుదల చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. “తాగే నీరు, పీల్చే గాలి, తినే పంటలు అన్నీ కలుషితమవుతున్నాయి. భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి. చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు” అని గ్రామస్తులు వాపోతున్నారు.

నియంత్రణ ఎక్కడ?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో, బీబీనగర్ మండలంలో, అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి, వెలిమినేడు తదితర గ్రామాల్లో అత్యధికంగా రసాయన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అయితే ఫ్యాక్టరీల చట్టం ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఆకస్మిక తనిఖీలు మాత్రం జరగడం లేదు.

“పెద్ద పరిశ్రమలన్నీ ప్రముఖ రాజకీయ పార్టీల నేతలవి కావడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు” అని కార్మిక సంఘాల నాయకులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.

డిమాండ్లు ఏమిటి?

  1. భద్రతా ప్రమాణాలు పాటించని, కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  2. ప్రతి 3 నెలలకు ఒకసారి థర్డ్ పార్టీ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్ ఆడిట్ తప్పనిసరి చేయాలి.
  3. ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
  4. నిబంధనలు పాటించని పరిశ్రమల లైసెన్సులు రద్దు చేయాలి. అది సాధ్యం కాకపోతే జనావాసాలకు దూరంగా తరలించాలి.
  5. బాధిత కార్మికులకు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి.

“లాభాల కోసం యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం పణంగా పెడుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ‘రెడ్ కేటగిరీ’ పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలి. లేదంటే పెను ప్రమాదాలు తప్పవు” అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఉద్యమాలకు సిద్ధమవుతున్న బాధితులు
భద్రతా ప్రమాణాలు పాటించకుండ, విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాలుష్య కారక రసాయన పరిశ్రమలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున అందోళనలు చేపడతామని ఆయా గ్రామాల బాధితులు, ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply