భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు..

భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు..
ఐదవ మంచినీటి ప్లాంట్ ప్రారంభం..
డీవీస్ లేబొరేటరీస్ సౌజన్యంతో ఏర్పాటు..
ఇంకో ప్లాంట్ ఏర్పాటుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు మరో ముఖ్యమైన అడుగు పడింది. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో కనకదుర్గా నగర్‌లో ఏర్పాటు చేసిన ఐదవ మంచినీటి ప్లాంట్‌ను గురువారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన డీవీస్ లేబొరేటరీస్ సౌజన్యంతో సుమారు రూ.15 లక్షల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు.

గత ఆరు నెలల్లోనే దుర్గాఘాట్, టోల్‌గేట్, కొత్త యాగశాల, శివాలయం ప్రాంతాల్లో నాలుగు ప్లాంట్‌లు ఏర్పాటు చేయగా, తాజా ప్లాంట్‌తో కలిపి మొత్తం ఐదు యూనిట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. వీటికి కలిపి సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
త్వరలో సి.వి. రెడ్డి ఛారిటీస్ సమీపంలో మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపిందని, అవసరమైన అనుమతులు కోరినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం సామాజిక బాధ్యతతో ప్లాంట్‌లను విరాళంగా అందించిన డీవీస్ లేబొరేటరీస్ యాజమాన్యాన్ని దేవస్థానం ఈఓ వీకే శీనా నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

