రైతుల్ని రోడ్డున పడేసిన కాంగ్రెస్ పాలన

రైతుల్ని రోడ్డున పడేసిన కాంగ్రెస్ పాలన
- మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ప్రమాదకరంగా చెలగాటమాడుతోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం పరకాల వ్యవసాయ మార్కెట్‌లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల దుస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ కేంద్రంలో కాంటాలు లేకపోవడం, గన్నీ సంచులు అందకపోవడం, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో పంటను కల్లాల్లో వేసి రోజుల తరబడి కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొన్నదని రైతులు వాపోయారు. “పంట పండించేది రైతు… లాభం మాత్రం దళారులకే” అన్న పరిస్థితిని ఈ ప్రభుత్వం మరింతగా పెంచిందని ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతును రాజుగా గౌరవిస్తే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతు బానిస స్థాయికి దిగజారిపోయాడని తీవ్ర విమర్శలు చేశారు. “రైతు భరోసా ఎక్కడ? రైతు బీమా ఎవరికి అందుతోంది? పంట కొనుగోళ్లు ఎందుకు నిలిచిపోయాయి?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
వ్యవసాయ రంగంపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం, రైతుల కష్టాలను పట్టించుకోకుండా కేవలం ప్రచార రాజకీయాలకు పరిమితమైందని విమర్శించారు. యూరియా కొరత, సాగునీటి సమస్య, కరెంట్ కోతలు అన్ని కలిపి రైతును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. “ఇది ప్రభుత్వం కాదు… రైతులపై భారంగా మారిన వ్యవస్థ” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ చుట్టూ తిరుగడంలో బిజీగా ఉన్న సీఎం, రైతుల కన్నీళ్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా మక్కల కొనుగోలు కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
