1stmay2026 | హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం..ఆ తర్వాత అసలు కథ

1stmay2026 | హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం..ఆ తర్వాత అసలు కథ

1stmay2026 | ఎందుకీ నిర్ణయం..?
ప్రభుత్వం చేతికి వెళ్తే రాయితీలు ఉంటాయా?
ఔట్ సోర్సింగ్ సెగ.. ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి?
విలీనం వల్ల ప్రయోజనం ఏమిటి?
మెట్రోకు ఇది అగ్నిపరీక్షేనా?

1stmay2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ఒక విడదీయలేని భాగంగా మారింది. ఇప్పటి వరకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో Larsen & Toubro (L&T) సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రోను పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే ఏం జరుగుతుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ విలీనం ప్రయాణికులకు వరమా? లేక సంస్థకు భారమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో నడిచిన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్ 1, మే 1 నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ పరం చేసేందుకు అవసరమైన ఆర్థిక, చట్టపరమైన ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

ఎందుకీ నిర్ణయం..?

మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఎల్ అండ్ టీ సంస్థ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. దాదాపు రూ. 6,600 కోట్ల వరకు నష్ట భారం, ఏడాదికి సుమారు రూ. 1200 కోట్ల వడ్డీ భారం సంస్థపై పడినట్లు ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రయాణీకుల ద్వారా వచ్చే ఆదాయం కంటే అప్పులపై చెల్లించే వడ్డీలు అధికంగా ఉండటంతో సంస్థ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని భావించినట్లు సమాచారం. ప్రభుత్వం దాదాపు రూ. 15,000 కోట్ల ఒప్పందంతో దీన్ని స్వాధీనం చేసుకునే దిశగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

1stmay2026 | ప్రభుత్వం చేతికి వెళ్తే రాయితీలు ఉంటాయా?

మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే చాలా మంది ప్రయాణీకులు ఆశించేది, ఆర్టీసీ బస్సుల్లో లాగా మెట్రో ప్రయాణంలోనూ రాయితీలు ఉంటాయా అన్నదే. ప్రైవేట్ సంస్థలు సాధారణంగా లాభాపేక్షతో పనిచేస్తాయి. కానీ ప్రభుత్వం పరిధిలోకి మెట్రో వస్తే ప్రజాసేవలో భాగంగా విద్యార్థులకు, సీనియర్ సిటిజన్లకు, అలాగే దివ్యాంగులకు రాయితీలు కల్పించే అవకాశంపై చర్చ జరుగుతోంది.

ప్రైవేట్ సంస్థల నిర్వహణలో ఉన్నప్పుడు లాభదాయకత దృష్ట్యా ఛార్జీలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రయాణికుల అభిప్రాయం. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీల నియంత్రణకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తున్న నేపథ్యంలో, మెట్రోలో కూడా మహిళలకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాయితీల వల్ల వచ్చే ఆదాయ లోటును ప్రభుత్వం భరించాల్సి ఉండటంతో ఇది ఆర్థికంగా పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.

ఔట్ సోర్సింగ్ సెగ

మెట్రోలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. మెయింటెనెన్స్, సెక్యూరిటీ, టికెటింగ్ సిబ్బందిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులైనవారే. వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సాంకేతికంగా క్లిష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఇతర ప్రభుత్వ సంస్థల మాదిరిగా సిబ్బంది కొరత, నిధుల విడుదలలో జాప్యం వంటి సమస్యలు మెట్రోను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇతర దేశాల్లో ప్రభుత్వ నిర్వహణలో మెట్రోలు సమర్థంగా నడుస్తున్న ఉదాహరణలు ఉన్నందున, సరైన పర్యవేక్షణ ఉంటే ఇక్కడ కూడా విజయవంతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

విలీనం వల్ల ప్రయోజనం

విలీనం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం మెట్రో రెండో దశ విస్తరణగా భావిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు లాభదాయకం కాని మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతుంటాయి. కానీ ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాతబస్తీ వంటి రద్దీ ప్రాంతాలకు, విమానాశ్రయానికి మెట్రోను వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం మీద మెట్రో ప్రభుత్వంలో విలీనం కావడం ఒక కత్తి మీద సాము లాంటిదేనని చెప్పొచ్చు. ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తూనే, ప్రైవేట్ సంస్థల తరహాలో నాణ్యమైన సేవలను కొనసాగించడం ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా మారనుంది. మెట్రోను మరో ఆర్టీసీలా కాకుండా, అత్యాధునిక ప్రభుత్వ రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దగలిగితేనే ఈ విలీనానికి పూర్తి సార్థకత లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

click here to read more

click here to read భారత ఇంధన భద్రత బలోపేతం

Leave a Reply