రాష్ట్రమంతా జిల్లావైపు చూస్తోంది..!

రాష్ట్రమంతా జిల్లావైపు చూస్తోంది..!

హనీట్రాప్‌ కేసులో సూత్రదారులను పట్టుకోవాలి..!

అనంతపురం, ఆంధ్రప్రభ : హనీట్రాప్‌ దందా వెలుగులోకి రావడంతో రాష్ట్రమంతా ఈరోజు జిల్లావైపు చూస్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం జిల్లా వైఎస్సార్‌సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతపురం జిల్లా అంటే సత్యసాయి ఫాదర్‌ విన్సెంట్ ఫెర్ర‌ర్ తరిమెల నాగిరెడ్డి ఇలా కారుణజన్ములు ప్రజలకు సేవలందించిన ప్రాంతం అనంతపురం జిల్లా. గతంలో ఫ్యాక్షన్‌ జిల్లాగా కూడా పేరుంది. ఫ్యాక్షన్‌ మరకలు అంటించిన వ్యక్తులు చరిత్రలో కలిసిపోయినా వారి అనవాళ్లు జిల్లాకు మచ్చను తెచ్చేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.సమాజంలో గౌరవకంగా బతుకుతున్న వారిని ఎంచుకుని వారి నంబర్లు సేకరించి వాట్సాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెట్టి ముగ్గులోకి లాగి తర్వాత వ్యక్తిగత ప్రదేశాలకు తీసుకెళ్లి న్యూడ్‌గా తయారు చేసి వీడియోలు ఫోటోలు తీసిన తర్వాత ముఠా సభ్యులు ప్రవేశించి నానా హంగామా చేసి బెదిరించి డబ్బులు వసూళ్లు చేయడం బాండ్లు రాయించుకోవడం ఆస్తులు రాయించుకునే హనీట్రాప్‌ మాఫియా జిల్లాలో నడుస్తోంది అని అన్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా డీఐజీ ఎస్పీ నేతృత్వంలో బాగా స్పందించారని కొనియాడారు. పాత్రదారులు అందరినీ అరెస్ట్‌ చేశారు. అలాగే చాలామంది పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకున్నారు.అయితే పాత్రదారులకు పరిమితమై సూత్రదారులను వదిలేస్తారా? అని ప్రశ్నించారు?సహజంగా ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారినే సీఐలు ఎస్‌ఐలుగా నియమిస్తారు. అలాంటి పోలీసు అధికారులు కోట్ల రూపాయలు దందా చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వరా? ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారి కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇవన్నీ జరుగుతాయా?గతంలో ఇటుకలపల్లి సీఐగా పని చేసిన రాజేంద్రనాథ్‌ యాదవ్‌ ఓహత్య కేసు విషయంలో ఆయనను బదిలీ చేశారు.హత్య జరుగుతుందనే ముందస్తు సమాచారం ఉన్న సిఐ చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.

రాప్తాడు సీఐ శ్రీహర్ష గతంలో ధర్మవరం నియోజకర్గంలో పని చేశాడు.ఈయన కూడా 2024లో వచ్చినప్పటి నుంచి కూడా మట్టి మాఫియాకు కొమ్ము కాస్తున్నాడు.ప్రశ్నించిన రైతులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.ఏకపక్షంగా వసూళ్లు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సెవెన్‌హిల్స్‌ హోటల్‌ నిర్వాహకురాలు హంపాపురం ఎంపీటీసీ సభ్యుడు రవికి భార్యగా పిలుస్తున్న రంగమ్మ చరిత్ర చాలా దారుణం. గతంలో రాప్తాడు వద్ద హత్యకు గురైన చిట్రా మురళి కేసులో కూడా ఈమె పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. మద్దెలచెరువు సూరి ప్రధాన అనుచరుడు భానుకోట కిష్టప్పపై కాల్పులు జరిపిన కేసులో ఈమె బంధువు ముద్దాయి అని తెలుస్తోంది. షెక్షానుపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్టాండులో పోలీసుల ఎదుటే హత్య చేసిన కేసులో ఈమె భర్త జైలుకు వెళ్లొచ్చాడనే విషయాలు బయటకు వస్తున్నాయి.హనీ ట్రాప్ వెనుక ఉన్న బీజేపీ టీడీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలి.నాలుగు ముఠాలుగా ఏర్పడి హనీట్రాప్‌ పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేసి సుమారు 100 కోట్ల దాకా వసూళ్లు చేసినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ధర్మవరం పట్టణంలో ఒక్క చేనేత వర్గం నుంచే 25 కోట్లు వసూళ్లు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మజ్జిగ లింగమయ్య కేసులో ఫిర్యాదులో ఉన్న ముద్దాయిలను తప్పించేందుకు ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు.చివరకు రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ను వీఆర్‌కు పంపారు. నాయకులను తృప్తి పరచడానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదింటి పిల్లలను పంపి చీకటి దందాను నడిపిస్తున్నారు. రాజకీయాల్ని అడ్డుపెట్టుకుని అమ్మాయిల మానప్రాణాలతో చెలగాటం ఆడతారా?పోలీసులను డోర్‌ మ్యాట్లుగా వాడుకుని వారితో ల్యాండ్‌ మాఫియా నడిపించారు.పేరూరు డ్యాం కింద వెయ్యికోట్ల విలువైన ఇసుక అమ్ముకున్నారు. పాపంపేటలో డబుల్‌ రిజిస్ట్రేషన్లతో జనాలను బెంబేలిత్తించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్‌ ఇసుక కూడా తెచ్చుకోలేదు. ఎవరిదైనా ట్రాక్టరును పట్టుకున్నారంటే విడిపించలేకపోయామని అన్నారు.

ఈరోజు పోలీసు అండదండలతో మట్టి దందా చేస్తున్నారు. టమాటా మండీలో ఎమ్మెల్యే ట్యాక్స్‌ లారీకి 2 వేలు చొప్పున దోచుకుంటున్నారు. జగనన్న కాలనీల్లో దొంగతనాలు చేస్తున్నారంటే ఈ పోలీసు అధికారులెవరూ కనీసం స్పందించలేదు.దొంగల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. హనీట్రాప్‌ కేసులో పోలీసులను మాత్రమే బలిచేయొద్దు.వారి వెనుక ఉండి ఆదేశాలిచ్చిన ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలి.డీఐజీ ఎస్పీ నిష్పక్షపాతంగా విచారిస్తున్నారనే విశ్వసిస్తున్నాము. లేదంటే సీఐడీ విచారణ వేయండి. జిల్లాను కాపాడండి.మాకు గతంలో ఫ్యాక్షన్‌ మరకలు అంటించారు.వాటి నుంచి బయటపడ్డాము. గతంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ జరిగేదని ఇప్పుడు వలపు వల దందా చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇందుకోసం రాజకీయాలను ఉపయోగించుకోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా హనీట్రాప్‌ నిర్వహించిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Leave a Reply