బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మేడ్చల్, (ఆంధ్రప్రభ): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ డివిజన్‌లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ ‘జెండా పండుగ’ కార్యక్రమానికి భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన పార్టీ బీఆర్‌ఎస్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ గడిచిన కాలంలో మౌనంగా ఉన్నామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గళమెత్తాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల విషయంలో గడిచిన కాలంలో కనీసం మూడు పథకాలను కూడా సరిగ్గా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. నియోజకవర్గంలో కనీసం తట్టెడు మట్టి కూడా పోయలేదని, అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని మండిపడ్డారు.
మేడ్చల్ సర్కిల్ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, ప్రజలు మంచినీటి సమస్యతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వార్డులో పండుగ వాతావరణం నెలకొందని భాస్కర్ యాదవ్ తెలిపారు. కార్యకర్తలకు కష్టాల్లో అండగా ఉండే నాయకుడు మల్లారెడ్డి అని, తన సొంత నిధులతో రోడ్లు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. రానున్న రెండేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిహెచ్‌ఎంసి 297, 298 డివిజన్లకు చెందిన మాజీ కౌన్సిలర్లు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. “జై తెలంగాణ.. జై జై తెలంగాణ” నినాదాలతో బిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
