పుష్కరాల కోసం భారీ ప్రణాళికలు

పుష్కరాల కోసం భారీ ప్రణాళికలు

  • కోటి లింగాల రేవు నుంచి రివర్ వ్యూ సబ్‌స్టేషన్ వరకు ఏర్పాటు
  • ఇప్పటికే విశాఖలో భూగర్భ కేబుల్ వ్యవస్థతో విజయవంతమైన విద్యుత్ సరఫరా
  • సబ్‌స్టేషన్ల ఏర్పాటు పనులు ప్రారంభం
  • పుష్కరాలకు సిద్ధం చేసే దిశగా ఈపీడీసీఎల్ చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ: అఖండ గోదావరి పుష్కరాలకు తరలివచ్చే అశేష జనవాహినికి అవసరమైన సదుపాయాల కల్పనలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు సమీక్షలు నిర్వహించి, ఇప్పటి నుంచే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లక్షలాది భక్తులు తరలివచ్చే పుష్కర ఘాట్ల వద్ద ప్రకాశవంతమైన వెలుగులు ఉండేలా ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. పుష్కర ఘాట్లలో ప్రత్యేక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలో విజయవంతంగా అమలైన అండర్‌గ్రౌండ్ కేబుల్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంతో మెరుగైన విద్యుత్ సరఫరాతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి.

కోటి లింగాల రేవు నుంచి ప్రారంభం
పుష్కరాల్లో పుణ్యస్నానాలు జరిగే ప్రధాన ఘాట్లలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం లక్ష్యంగా ఈపీడీసీఎల్ చర్యలు చేపట్టింది. కోటి లింగాల రేవు నుంచి ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని రివర్ వ్యూ సబ్‌స్టేషన్ వరకు భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు దశల్లో అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 33 కేవీ హైటెన్షన్ నెట్‌వర్క్ కోసం 7.278 కిలోమీటర్ల మేర కేబుల్ వేయనున్నారు. అలాగే 11 కేవీ లైన్లను 7.642 కిలోమీటర్ల మేర భూగర్భంలో అమర్చనున్నారు. లో టెన్షన్ లైన్ నెట్‌వర్క్ కోసం 13.305 కిలోమీటర్ల మేర యూజీ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుసంధానంగా 500 కేవీఏ సామర్థ్యం గల 19 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

రూ.150 కోట్లు కేటాయింపు
పుష్కరాల కోసం ఘాట్ల వద్ద ప్రత్యేక విద్యుత్ పనుల నిర్వహణకు రూ.150 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో ఇప్పటికే యూజీ పనులు ప్రారంభించారు. ఇటీవల ఈ పనులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఆరు నెలల్లో పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. పనుల్లో నాణ్యతకు రాజీపడకుండా చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రాజమహేంద్రవరం అధికారులు ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షలాది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డీటీఆర్‌లతో పాటు 152 సర్వీస్ పిల్లర్లు, ఫీడర్ల కోసం మరో 38 ఏర్పాట్లు చేయనున్నారు.

Leave a Reply