మా జీవన ఆధారాన్ని కాపాడండి..

మా జీవన ఆధారాన్ని కాపాడండి..

తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావుకు రైతుల వినతి

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మా జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడాలని కోరుతూ, క్వాంటం వ్యాలీ ఏపీఐఐసీ ద్వారా కార్పోరేట్ కంపెనీల స్థాపన పేరుతో భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా చీమలపాడు రెవెన్యూ పరిధిలోని కోమటికుంట గ్రామ రైతులు శనివారం తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావును వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ,పంటలపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలకు భూముల కోల్పోవడం తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. పలు తరాలుగా సాగుచేస్తున్న భూములు తమకు కేవలం ఆస్తి మాత్రమే కాకుండా జీవనాధారం, సంస్కృతి, భవిష్యత్తు అని వివరించారు. దీనిపై స్పందించిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోమటికుంట గ్రామంలో ఎంత మేరకు సాగుభూములు ఉన్నాయో, ఎన్ని ఎకరాలు ప్రభావితమవుతున్నాయో రెవెన్యూ అధికారుల ద్వారా సమగ్ర సమాచారం సేకరిస్తామని తెలిపారు.

గ్రామంలోని రైతులందరితో కలిసి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అభివృద్ధి, రైతుల హక్కులు రెండూ సమానంగా పరిరక్షించబడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పోరేట్ కంపెనీలు రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రైతులకు నష్టం కలగకుండా సరైన పరిహారం, పునరావాసం కల్పించి న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ మంత్రులకు తెలియజేసి రైతుల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని,ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు తమ కృషి కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి, వేములకొండ సాంబశివరావు, వేములకొండ రామకృష్ణ, చీపు వెంకటేశ్వరరావు, కాసగాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply