24thaprileditorial | మహిళల భారీ స్పందన.. ఓటింగ్‌లో ఉత్సాహం..

24thaprileditorial | మహిళల భారీ స్పందన.. ఓటింగ్‌లో ఉత్సాహం..
24thaprileditorial | బెంగాల్లో 92% పైగా పోలింగ్ నమోదు
ఓటర్ల జాబితాపై వివాదం.. రాజకీయ ఆరోపణలు
తమిళనాడులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
మే 4న ఓట్ల లెక్కింపు.. బెంగాల్ పై దేశం దృష్టి
24thaprileditorial | ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల పోలింగ్ ఇప్పటికే ముగియగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లో గురువారం జరిగిన పోలింగ్ దాదాపు ప్రశాంతంగా కొనసాగింది. ఈ రెండు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించాయి.
పశ్చిమ బెంగాల్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా 92 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొదటి విడతగా 152 నియోజకవర్గాల్లో గురువారం ఓటింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు మహిళలు భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా బిల్లుకు మద్దతుగా మహిళలు అధిక సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు వచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఇదే సమయంలో, రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ముమ్మర పరిశీలన (SIR) పేరిట 90 లక్షలకు పైగా పేర్లు తొలగించడంపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, అందువల్లే ఈసారి పోలింగ్ శాతం గరిష్ట స్థాయికి చేరిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల ఆరోపణలు మాటల యుద్ధంకు మాత్రమే పరిమితమయ్యాయి.
SIR కింద తొలగించబడిన వారిలో హిందువులు 64 శాతం, ముస్లింలు 34 శాతం ఉన్నారని సమాచారం. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముర్షిదాబాద్‌లో హుమాయూన్ కబీర్ ఒక పోలింగ్ కేంద్రానికి రావడంతో తృణమూల్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ నివేదిక కోరింది. బెంగాల్లో రెండో దశ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి.

తమిళనాడులో గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ స్థాపించిన కొత్త పార్టీ కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో కరూర్ జిల్లాలో అత్యధికంగా 91 శాతం పోలింగ్ నమోదైంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూర్‌లో 89 శాతం, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న చెపాక్‌లో 83 శాతం పోలింగ్ నమోదైంది. విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్‌లో 81 శాతం, తిరుచ్చి ఈస్ట్‌లో 89 శాతం పోలింగ్ నమోదైంది. ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
బెంగాల్, తమిళనాడుల్లో ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. మిగిలిన మూడు రాష్ట్రాలతో పోలిస్తే, ఈ రెండు రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో రాజకీయ ఉద్రిక్తత మధ్య పోలింగ్ జరిగినప్పటికీ, మొత్తం ప్రక్రియ అంతరాయం లేకుండా పూర్తయింది. దేశవ్యాప్తంగా బెంగాల్ పోలింగ్‌పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకృతమైంది. మమతా బెనర్జీ, బీజేపీ నాయకుల మధ్య చివరి వరకూ మాటల తూటాలు కొనసాగాయి. కాగా తమిళనాడులో పోలింగ్ శాతం 85 శాతాన్ని దాటింది.
