మొక్కజొన్న రైతులను ఆదుకునే వారెవరు?

మొక్కజొన్న రైతులను ఆదుకునే వారెవరు?

రైతాంగాన్ని నట్టేట ముంచిన కేంద్ర ప్రభుత్వం

రాప్తాడు, ఆంధ్రప్రభ : జిల్లాలో మొక్కజొన్న పంట పండించిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయని పలువురు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ పంటలు కొనుగోలు చేయడంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని స్పష్టంగా కనబడుతోంది. ఇక ప్రైవేట్ దళారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

అడ్డదిడ్డంగా తక్కువ ధరలకు పంటలు కొనుగోలు చేస్తున్నారు. రైతు పడిన కష్టానికి విలువ లేకుండా పోతోంది.మొక్కజొన్న ఒక ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అన్నారు.గత సంవత్సరం మొక్కజొన్న ఒక క్వింటాలు రూ.2000 నుండి 2200 వరకు అమ్మిన రైతులు నేడు క్వింటాలు రూ.1600 నుండి రూ.1700 అమ్ముకుంటున్నారు. క్వింటాలుకు రూ.500 నుండి రూ.600 నష్టపోతున్నారు. మొక్కజొన్న పంట పండించాలంటే ఒక ఎకరాకు 30 వేల నుండి 40 వేలు ఖర్చు వస్తోందని రైతులు చెబుతున్నారు.

మరి ఇంత నష్టానికి అమ్ముకోవాలంటే చాలా కష్టంగా ఉన్నా కానీ పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలైనా చెల్లించాలి కాబట్టి పంటను అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ దళారులను పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు. దళారుల నుండి పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేసి ఆర్థికంగా లాభం చేకూర్చి వాళ్లను పెంచి పోషిస్తూ రాజకీయ లబ్ధి కోసం దళారులను వాడుకుంటున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే.

ప్రైవేట్ వ్యాపారస్తులే ముఖ్యమైన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతులకు అరా కొరా సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. దయచేసి ఇప్పటికైనా జిల్లా మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను క్వింటాలు రూ.2400తో కొనుగోలు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. లేదా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) ఉన్నాయి.వాటికి లైసెన్సులు మంజూరు చేసి రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే బాధ్యతలు అప్పగించాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply