ఫిన్లాండ్ మోడల్‌ వైపు తెలంగాణ చూపు..

ఫిన్లాండ్ మోడల్‌ వైపు తెలంగాణ చూపు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానానికి మారుపేరైన ఫిన్లాండ్ దేశంలో తెలంగాణ ఉపాధ్యాయుల బృందం పర్యటిస్తోంది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు జరుగుతున్న ‘టీచర్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’లో భాగంగా బుధవారం హెల్సింకీలోని ఒక ప్రభుత్వ పాఠశాలను బృందం సందర్శించింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అక్కడి తరగతి గదుల్లోని బోధనా పద్ధతులు, మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫిన్లాండ్ పాఠశాలల్లో క్రమశిక్షణకు, విద్యార్థుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ తెలిపారు.

ముఖ్యంగా తరగతి గదుల్లో విద్యార్థులతో కలిసి ఫోటోలు తీయడం లేదా వీడియోలు చిత్రీకరించడం వంటి అంశాలపై అక్కడ కఠిన నిషేధం ఉందని, ఆ నిబంధనలను గౌరవిస్తూ బోధనా విధానాలను పరిశీలించామని ఆయన పేర్కొన్నారు. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో మార్కులకు కాకుండా జీవిత నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. 9వ తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ పరీక్షలు నిర్వహించకుండా సమగ్ర మూల్యాంకనం ద్వారా వారి అభివృద్ధిని అంచనా వేస్తారని బృందం గమనించింది. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, బోధనా విధానాలను స్వయంగా రూపొందించుకునే పూర్తి స్వయంప్రతిపత్తి వారికి కల్పించబడుతుందని అధికారులు వివరించారు.

Leave a Reply