సర్కారీ బడుల్లో విద్యా విప్లవం

సర్కారీ బడుల్లో విద్యా విప్లవం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. రెండో తరగతి విద్యార్థుల్లో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై నిర్వహించిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) వార్షిక అసెస్మెంట్ 2025–26 నివేదికలో అబ్బురపరిచే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. 2022 బేస్లైన్ గణాంకాలతో పోలిస్తే, ప్రస్తుత ఏడాది విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. ఎస్సీఈఆర్టీ, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (సీఎస్ఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో సర్కారీ పాఠశాలల విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతిభ చాటారు.
నివేదిక ప్రకారం, ఇంగ్లిష్ చదవడంలో విద్యార్థులు రికార్డు స్థాయి పురోగతిని కనబరిచారు. 2022లో కేవలం 4 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఇంగ్లిష్ వాక్యాలను చదవగలిగే స్థితిలో ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 29 శాతానికి చేరింది. అంటే మూడేళ్ల కాలంలో ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. మూడు సంవత్సరాల క్రితం కనీసం ఒక పదాన్ని కూడా చదవలేని స్థితి నుంచి ఇప్పుడు పూర్తి వాక్యాలను చదివే స్థాయికి విద్యార్థులు ఎదిగినట్లు నివేదిక వెల్లడించింది.
తెలుగు, గణితంలోనూ పెరిగిన సామర్థ్యం
భాషా సామర్థ్యాలతో పాటు గణితంలోనూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. తెలుగు వాక్య పఠన సామర్థ్యం 9 శాతం నుంచి 35 శాతానికి (సుమారు నాలుగు రెట్లు) పెరిగింది. గణితంలో క్యారీ-ఓవర్ కూడికలను సరిగ్గా చేయగలిగే విద్యార్థుల శాతం 18 నుంచి 43 శాతానికి చేరింది. అలాగే, తీసివేతల వంటి క్లిష్ట అంశాల్లో సామర్థ్యం 10 శాతం నుంచి 30 శాతానికి పెరిగి మూడింతల వృద్ధిని చూపింది. ఉర్దూ మాధ్యమంలో ఈ ఏడాది అత్యధికంగా 15 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది.
అగ్రస్థానంలో ఐదు జిల్లాలు
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ అసెస్మెంట్లో పెద్దపల్లి, నారాయణపేట, వనపర్తి, జనగామ, ఖమ్మం జిల్లాలు ఉత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ ఐదు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 1,750 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,500 మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. ఫిబ్రవరిలో టాబ్లెట్లు, మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ విధానంలో ప్రతి విద్యార్థిని ముఖాముఖిగా పరీక్షించి గణాంకాలను సేకరించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
