భగీరథ స్ఫూర్తితో జల సంరక్షణకు భారీ కార్యక్రమాలు

భగీరథ స్ఫూర్తితో జల సంరక్షణకు భారీ కార్యక్రమాలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమాలను అమలు చేస్తూ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి రాష్ట్రస్థాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ మహర్షి తపస్సు, సంకల్పం, పట్టుదలతో గంగను భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప ఆదర్శాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నీటి వనరులు పరిమితంగా ఉన్నందున నీటి సంరక్షణ అత్యవసరమని పేర్కొన్నారు. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఈ ఏడాది సుమారు 8,000 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేపట్టామని, దీనిని మరింత విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరి పంటకు అధిక నీటి అవసరం ఉండటంతో రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించారు. జలధార–జలహారతి కార్యక్రమాల ద్వారా పాత చెరువులు, కాలువలు పూడికతీత చేసి పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 246 ఎంఐ చెరువులు, 435 కుంటలను అభివృద్ధి చేసి భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చెరువులను అనుసంధానం చేసి నీటి వృథాను నివారిస్తున్నామని వెల్లడించారు. మొత్తం 3,445 పనులను గుర్తించి అమలు చేస్తున్నామని, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కార్మికులను వినియోగిస్తూ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్‌వెల్స్ సక్రమంగా పనిచేయడంతో పాటు వేసవిలో నీటి సమస్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని 3 మీటర్ల వరకు పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భగీరథ స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం..
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ భగీరథ మహర్షి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహనీయుడని కొనియాడారు. సమాజం కోసం చేసిన ఆయన తపస్సు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కృషి చేస్తోందని తెలిపారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ భగీరథుని సంకల్పం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. సమాజ సేవే ఆయన జీవితం అందించిన ప్రధాన సందేశమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని వర్గాలకు గౌరవం లభిస్తోందని తెలిపారు.
బీసీల అభ్యున్నతి – మహిళా విద్యకు ప్రాధాన్యం..
టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణ మాట్లాడుతూ బీసీలు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మహిళా విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. భగీరథుని స్ఫూర్తితో ఆదోనిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకారం అందిస్తామని తెలిపారు.
బీసీల గౌరవానికి ప్రభుత్వ కృషి అభినందనీయం..
ఉప్పర సాగర సంఘం చైర్మన్ వెంకట రమణప్ప మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సాధికార కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా బీసీలకు బలం చేకూరిందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం అవసరమని చెప్పారు. అనంతరం బీసీ వసతి గృహాల ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలు, మెడల్స్‌తో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన్న, ఉప్పర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు, జిల్లా అధ్యక్షులు శివన్న, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, డిసిఎంఎస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, రాష్ట్ర ఉప్పర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
