ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో సమన్వయం ఏర్పరచుకుని సరిహద్దు జుక్కల్ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు.

గురువారం జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాల వల్ల పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదని తెలిపారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రైనేజీలు, పచ్చదనం, పారిశుభ్రత, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

సరిహద్దు జుక్కల్ ప్రాంతంలో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేసినప్పుడే మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయని, అందుకు అధికారులు–ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సంక్షేమ పథకాలు అన్ని అర్హులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply