Telangana Sadabainama Regularisation | సాదాబైనామాల క్రమబద్ధీకరణకు బ్రేక్‌లు..

Telangana Sadabainama Regularisation | సాదాబైనామాల క్రమబద్ధీకరణకు బ్రేక్‌లు..

Telangana Sadabainama Regularisation | సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన

ప్రభుత్వం సరళతరం చేసినా ముందుకు కదలని ఫైళ్లు

9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో..

రైతుల్లో అసంతృప్తిఆర్డీవోలకు పూర్తి అధికారాలు.. అయినా మందగమనమే

Telangana Sadabainama Regularisation | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెల్లకాగితాలపై భూముల కొనుగోలు ఒప్పందాల (సాదా బైనామా) క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వీటి పరిష్కారానికి నిబంధనలు సరళతరం చేసినప్పటికీ అధికారులు ఎందుకో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం లక్షల దరఖాస్తులు రెవెన్యూ శాఖకు వచ్చాయి. చాలా జిల్లాల్లో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదన్న అసంతృప్తి అన్నదాతల నుంచి వ్యక్తమవుతోంది. మెజారిటీ అర్జీలను అధికారులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.

క్రమబద్ధీకరణలో భాగంగా భూమిని కొన్నవారు తమ కొనుగోలు ప్రక్రియ వాస్తవమని అఫిడవిట్ సమర్పిస్తే దాని ఆధారంగా సరిహద్దు రైతులను అధికారులు విచారిస్తున్నారు. తహసీల్దార్లు నివేదికలు రూపొందించి ఆర్డీవోలకు పంపిస్తున్నారు. గతంలో (2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు) సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి ఫైళ్లను మాత్రమే ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు.

జీఓ 76, 77లకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏజెన్సీయేతర ప్రాంతాల్లో సాదాబైనామా పద్ధతిలో కొనుగోలు చేసిన భూములు క్రమబద్ధీకరణ కావాల్సి ఉంది. క్షేత్రస్థాయి సర్వే పూర్తయిన భూములకే డిమాండ్ నోటీసులు జారీ చేస్తుండడంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాక 30 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఎలాంటి అభ్యంతరాలు రాని భూముల సమాచారాన్ని భూభారతి పోర్టల్లో నిక్షిప్తం చేస్తున్నారు.

కొన్ని భూములకు లక్షల్లో రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలు చెల్లించేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం సరళతరం చేసినా…

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ సమస్యకు పరిష్కారం చూపింది. ఇకపై సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించుకోవడానికి భూమి అమ్మిన వ్యక్తి సంతకం కోసం తిరగాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ప్రస్తుతం ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో, ఆ కొనుగోలుదారు ఇచ్చే స్వయం ప్రకటన (డిక్లరేషన్) పత్రం సరిపోతుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారులకు (ఆర్డీవో) ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాలను కట్టబెట్టింది.

దరఖాస్తుదారుడు ఇచ్చే డిక్లరేషన్‌లో ఈ భూమి తనదేననీ, ఒకవేళ తానిచ్చిన సమాచారం తప్పని తేలితే చట్టప్రకారం ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రాసివ్వాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఆర్డీవోలు సాదాబైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారుడికి ఉన్న హక్కులు, భూమి స్వాధీనంలో ఉందా లేదా అనే విషయాలను తనిఖీ చేస్తున్నారు.

కొనుగోలుదారుడి నుంచి అఫిడవిట్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుంటున్నారు. విచారణ పూర్తయ్యాక, ఆ భూమి వివరాలను భూభారతి పోర్టల్లో 30 రోజుల పాటు డిస్ప్లే చేస్తున్నారు. నెల రోజుల్లో ఎలాంటి అభ్యంతరాలు, తగాదాలు రాకపోతే దరఖాస్తుదారుడికి భూమిపై పూర్తి హక్కులు కల్పిస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన కొత్త గైడ్లైన్స్ చాలా సంక్షిప్తంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో అధికారులకు కొన్ని సందేహాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలతో పోలిస్తే ఇప్పుడు పూర్తి స్పష్టత లేకపోవడంతో, ఎక్కడ దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయి అధికారులను పురమాయించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.


Leave a Reply