ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు శ్రీకారం

ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు శ్రీకారం
అమరావతి, ఆంధ్రప్రభ : పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా మరోసారి ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనకాపల్లి జిల్లాపై దృష్టి సారించిన పారిశ్రామిక వర్గాలు, ఇప్పుడు మరోసారి ఈ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై అన్ని దేశాలు దృష్టి పెట్టుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కూడా ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రంలో ప్రోత్సాహం కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపనకు ప్రముఖ ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్’ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, రాంబిల్లి ప్రాంతంలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా మరో భారీ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
దేశంలో ఇప్పటికే 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ముందంజలో ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో మరో భారీ క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు గురువారం భూమి పూజ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు.
మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబడితో అమలవనున్న ఈ ప్రాజెక్టు, అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ, రూ.4,200 కోట్ల వ్యయంతో 6 గిగావాట్ల సామర్థ్యమున్న సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అదనంగా రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.
రాయలసీమలో మరో భారీ ప్లాంట్…
రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని భారీగా పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇంధన రంగం బలోపేతమైతే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గతేడాది నవంబరులో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ, రాష్ట్రంలో దశలవారీగా రూ.82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో సుమారు రూ.22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకదాన్ని ఏర్పాటు చేయనుంది.
ఉత్తరాంధ్రలో అభివృద్ధి జోరు… పెట్టుబడుల హోరు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వరుసగా స్థాపించబడుతున్నాయి. ఇప్పటికే ఆర్సెలర్ మిట్టల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు శంకుస్థాపనలు జరిగి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించగా, త్వరలో గూగుల్ సంస్థకు కూడా శంకుస్థాపన జరగనుంది. సాఫ్ట్వేర్, ఎనర్జీ, స్టీల్, మెడ్‌టెక్, ఫార్మా రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది. పర్యాటక, ఆధ్యాత్మిక రంగాల్లో కూడా ప్రాంతీయ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.
రెన్యూ సంస్థ గత ప్రయాణం
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే 2015లో కళ్యాణదుర్గంలో విండ్ ప్రాజెక్ట్‌తో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 717 మెగావాట్ల విండ్, 60 మెగావాట్ల సోలార్ సామర్థ్యంతో ప్లాంట్లు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
గురువారం ఉదయం 09:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి బయలుదేరి, 11:10 గంటలకు రాంబిల్లిలో జరిగే రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 02:35 గంటలకు అమరావతి చేరుకుంటారు.
