ఆర్టీసీ సమ్మె..

ఆర్టీసీ సమ్మె..

  • విధులు బహిష్కరించిన కార్మికులు
  • డిపోలకే పరిమితమైన బస్సులు
  • ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. బుధవారం అర్థరాత్రి నుంచి కార్మికులు విధులు బహిష్కరించడంతో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ ఆర్టీసీ డిపో వద్ద తెల్లవారుజామున జేఏసి నేతలతో కలిసి కార్మికులు పెద్ద ఎత్తున బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తుతో మోహరించారు. మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బస్సులను డిపోల నుండి బయటకు వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 30 శాతం ఫిట్మెంట్, వేతన బకాయిల చెల్లింపు చేయాలన్నారు. పీఎఫ్, సీసీఎస్ కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనియన్ల పునరుద్ధరణ చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు వినతి పత్రాలను అందించినా స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.

అయితే కార్మికుల సమ్మెతో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. సమ్మె ప్రభావంతో బస్సులు నిలిచిపోవడం వలన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి సారించింది. అద్దె బస్సులను నడిపించడంతో పాటు తాత్కాలికంగా కండక్టర్ల నియామకానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయా డిపో మేనేజర్లు ప్రకటించారు.

Leave a Reply