మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే…

మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే…
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ
విజయవాడ, ఆంధ్రప్రభ : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ మహిళల ఆకాంక్షలకు విరుద్ధమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు తీసుకువచ్చిన చారిత్రక బిల్లును అడ్డుకోవడం అనేది కోట్లాది మహిళల న్యాయమైన హక్కులను కాలరాయడమేనన్నారు. దేశ రాజకీయ వ్యవస్థలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అత్యవసరతను విపక్షాలు అర్థం చేసుకోలేకపోయాయని విమర్శించారు. మహిళలు కేవలం ఓటర్లు మాత్రమే కాదు.
పాలనలో కీలక భాగస్వాములని, వారి గొంతుకను వినిపించే వేదికగా ఈ బిల్లు ఎంతో కీలకమని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అనేది సామాజిక న్యాయం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలకు విరుద్ధం. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, దేశ అభివృద్ధిని వెనక్కి నెట్టే చర్య” అని గద్దె అనురాధ పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో స్థానం కల్పిస్తేనే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ అవకాశాన్ని కోల్పోవడం దేశానికి నష్టం అని చెప్పారు. మహిళా సాధికారతపై మాటలకే పరిమితం కాకుండా, చర్యల ద్వారా నిబద్ధతను చూపాల్సిన సమయం ఇదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా సాధికారత పట్ల ఉన్న చరిత్రను గుర్తుచేస్తూ, ఎన్టీఆర్ మహిళల అభ్యున్నతికి పునాది వేసిన మహానేత అని తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కులు కల్పిస్తూ సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఇవ్వడంలో ఎన్టీఆర్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
దాని సాగింపుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మహిళా పారిశ్రామిక వేత్త ఉండాలని ఆశీస్తూ, కోటి మంది డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారని తెలిపారు. డ్వాక్రా మహిళలు ఉత్పత్తులు ఐక్యరాజ్య సమితికి స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. ఆ దిశలోనే టీడీపీ ఎప్పటికీ మహిళల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు తమ అసలు వైఖరిని బయటపెట్టాయని, మహిళల ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తూ, వారి హక్కుల విషయంలో వెనక్కి తగ్గడం దురదృష్టకరమని గద్దె అనురాధ మండిపడ్డారు.
ఇది మహిళలపై రాజకీయ ద్రోహమని, దీనికి మహిళలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. చివరిగా, మహిళా హక్కుల పరిరక్షణలో టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో మహిళల సాధికారత కోసం మరింత బలమైన పోరాటం కొనసాగిస్తామని గద్దె అనురాధ తెలిపారు. మహిళలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.
