తహసీల్దార్ లేక భీంగల్ ప్రజలకు ఇబ్బందులు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : “అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు” అన్నట్టుగా భీంగల్ పరిస్థితి మారింది. పాత తాలూకా కేంద్రంగా ఉన్న భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో శాశ్వత తహసీల్దార్ లేకపోవడంతో పాలన స్తంభించిపోయింది.
ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన మొహమ్మద్ షబ్బీర్‌ను గత నెల 11న జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్ల మేరకు బదిలీ చేసి, కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు. అప్పటి నుండి దాదాపు 45 రోజులు గడిచినా కొత్త తహసీల్దార్‌ను నియమించలేదు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
దీంతో తహసీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలు అధికారులు అందుబాటులో లేక పనులు జరగక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది కార్యాలయానికి వచ్చి పనులు పూర్తికాక తిరిగి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇంకా కార్యాలయం ఊరి చివరన ఉండటం వల్ల ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అధికారులు లేకపోవడం, మరోవైపు దూరం ప్రయాణించి పనులు కాకపోవడం ప్రజలకు భారంగా మారింది.
బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, స్టేట్ సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి లు ఈ సమస్యను గుర్తించి, భీంగల్‌కు శాశ్వత తహసీల్దార్‌ను నియమించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
