రోడ్డుపై మురుగునీరు… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
రోడ్డుపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితి నెలకొన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి, రోడ్డును శుభ్రపరచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వంటి ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఈ సమస్యపై స్పందన లేకపోవడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు.
