Rahul Gandhi | శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర

Rahul Gandhi | శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర
లోక్సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని కొనియాడిన ఆయన, ప్రస్తుత బిల్లులోని లోపాలను ఎండగట్టారు. సభలో చాలామంది మహిళల గొప్పతనం గురించి ప్రసంగించారని, ముఖ్యంగా తన సోదరి ప్రియంక గాంధీ ప్రసంగం తనకు ఎంతో గర్వకారణంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
ఇది సాధికారత కోసం తెచ్చిన బిల్లు కాదు:
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుపై రాహుల్ గాంధీ పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. “ఇది అసలైన మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు.. మహిళా సాధికారత కోసం పెట్టిన బిల్లు అంతకన్నా కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే” అని ఆయన విమర్శించారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేసిన ఆయన, కొత్త నిబంధనలు చేర్చకుండా ఆ 2023 బిల్లునే తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఓబీసీలకు అన్యాయం.. మనువాదానికే ప్రాధాన్యత:
ఈ బిల్లులో ఓబీసీ (OBC), ఎస్సీ, ఎస్టీలకు ఉప రిజర్వేషన్లు కల్పించకపోవడంపై రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కంటే మనువాదానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. దీనివల్ల వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గణాంకాలతో సహా ఓబీసీల ప్రాతినిధ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
దక్షిణాది హక్కుల అపహరణ.. బీజేపీ కుట్ర:
డీలిమిటేషన్తో ముడిపెట్టడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల రాజకీయ హక్కులను కేంద్రం లాక్కుంటోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకే బీజేపీ ఇటువంటి కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, జనాభా గణన మరియు పునర్విభజనతో సంబంధం లేకుండా ఇప్పుడే ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
