పాలిసెట్-2026కు సర్వం సిద్ధం

పాలిసెట్-2026కు సర్వం సిద్ధం

పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం

శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2026) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు.

పరీక్షల సజావుగా నిర్వహణకు శ్రీకాకుళం, టెక్కలి, పలాస ప్రాంతాలను మూడు ప్రధాన సమన్వయ కేంద్రాలుగా గుర్తించి, మొత్తం 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని పోలీసు, ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ పరీక్షా ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. నారాయణరావు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం సమన్వయ కేంద్రం పరిధిలోని 25 కేంద్రాల్లో 6,859 మంది, టెక్కలి పరిధిలోని 8 కేంద్రాల్లో 2,555 మంది, మరియు పలాస పరిధిలోని 9 కేంద్రాల్లో 2,441 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

టెక్కలి కేంద్రానికి సిహెచ్. వి. నరసింహం, పలాస కేంద్రానికి డా. కె. యమున కోఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారులు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

Leave a Reply