అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్‌లు

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్‌లు

టెక్కలి, ఆంధ్రప్రభ : పేదలు, పట్టణానికి ఉపాధి వచ్చిన కూలీలు, కార్మికులు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు. 5 రూపాయలకే కడుపునిండా భోజనం పెట్టేందుకు అన్నా క్యాంటీన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నూతన అన్నా క్యాంటీన్ భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు , కార్పొరేషన్ లలో 207 అన్నా క్యాంటీన్ లు నిర్వహిస్తుండగా, నేటి నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి  కొత్తగా 67 అన్నా క్యాంటీన్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రత్యేకంగా టెక్కలి నియోజకవర్గం లో రెండు అన్నా క్యాంటీన్ లు నిర్వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. రోజువారీ కూలీల పనులకు వెళ్ళే వారికి, వృద్ధులకు అన్నా క్యాంటీన్ లు కొండంత అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఆహారం నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాన్ని వడ్డించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అన్నా క్యాంటీన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామనే హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడుతున్నారని చెప్పారు.

పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలి నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తన ఆశయమని వెల్లడించారు. అనంతరం అన్నా క్యాంటీన్ కు వచ్చిన పేదలకు భోజనాన్ని జిల్లా కలెక్టర్, మంత్రి స్వయంగా వడ్డించారు. పేదల తో పాటు కలసి భోజనం చేసి ఆహార నాణ్యత, రుచిని పరిశీలించారు. బోజన వంటకాల రుచి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహణాధికారి వంశీ కృష్ణా, ఎమ్.కృష్ణ మూర్తి, డి ఎల్ డిఓ అలివేలు మంగ, ఎమ్ పీ డీ వో రేణుక, తాసిల్దార్ సత్యం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎమ్.సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి కె.రామ కృష్ణ, తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply