మార్గదర్శకులు మహాత్మా జ్యోతిరావు పూలే

మార్గదర్శకులు మహాత్మా జ్యోతిరావు పూలే
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : సామాజిక సమానత్వం, విద్యా విప్లవానికి మార్గదర్శకుడైన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం పాల్గొని పూలే మహనీయ సేవలను స్మరించుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాన హక్కులు, విద్యా అవకాశాల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారధి, ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల డైరెక్టర్లు, అధికారులు పాల్గొని పూలే ఆశయాలను కొనియాడారు.
సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. పూలే జీవితం సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమం మొత్తం గౌరవప్రద వాతావరణంలో సాగి, మహాత్మా పూలే సేవలను గుర్తుచేసేలా నిలిచింది.
