mukul choudhary|లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు

mukul choudhary|లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు

తండ్రి మాట‌కు క‌ట్ట‌బ‌డిన ముకుల్ చౌద‌రి
రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ముకుల్ చౌద‌రి
కేకేఆర్‌తో మ్యాచులో లక్నోను గెలిపించిన ప్లేయర్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ముకుల్ చౌద‌రి ఈ పేరు నిన్న‌టివ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఈ రోజు అత‌ని పేరు మార్మోగిపోతోంది. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించిందంటే కార‌ణం ముకుల్ చౌద‌రి అని చెప్ప‌వ‌చ్చు. అత‌ని అద్భుత ఇన్నింగ్స్ ఆడి ల‌క్నోను ఒంటి చేత్తో గెలిపించి అసలుసిసలు హీరో అనిపించుకున్నాడు ఈ 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించి సెన్సేషన్‌గా మారాడు. ఓట‌మి అంచున ఉన్న ల‌క్నోను సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించి గెలిపించాడు. అతను 27 బంతుల్లో 54 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించిన సంచలన ఆటగాడుగా మారాడు. ఇత‌ను మైదానంలో ఫ్ల‌డ్‌లైట్ల వెలుతురులో ఆడ‌టం రెండోసారి అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. అలాంటి ఆట‌గాడు ప్ర‌పంచ స్థాయి బౌల‌ర్ల‌ను ఒక ఆట ఆడుకున్నాడు.

గౌరవంతో తిరిగి రావాలి..
ముకుల్ చౌద‌రి గురించి తెలుసుకుంటే సినిమా స్టోరీకి ఏ మాత్రం త‌క్కువ‌గా ఉండ‌దు. నాన్న మాట కోసం క‌ట్టుబ‌డి ప‌ట్టుద‌ల‌తో పైకొచ్చాడు. చిన్న‌వ‌య‌సులోనే అద్భుత‌మైన క్రికెట‌ర్‌గా రూపాంత‌రం చెంది ఈ రోజు త‌న తండ్రి కోరిక‌ను తీర్చాడు. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా, గుఢాగాడ్జీ అనే చిన్న గ్రామానికి చెందిన ముకుల్‌ సీకర్ లోని ఏబీఎస్ క్రికెట్ అకాడమీలో శిక్ష‌ణ పొందాడు. అక్క‌డ చేర్పించే సమయంలో తండ్రి ఒకటే మాట చెప్పాడు. నువ్వు క్రికెటర్‌గా గౌరవంతో తిరిగి రావాలి.. లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు అని ముకుల్ తండ్రి చెప్పాడు. తండ్రి మాటను గౌర‌వించి పట్టుదలతో శ్రమించిన ముకుల్ నేడు ఐపీఎల్ వేదికగా ల‌క్నోకు అద్భుత విజ‌యాన్ని అందించాడు.

అత‌నో ఆల్‌రౌండ‌ర్‌..
ముకుల్ బ్యాటరే కాదు, వికెట్ కీపింగ్, ఫాస్ట్ బౌలింగ్ చేయ‌గ‌ల ఆల్ రౌండర్. ఈ ఏడాది వేలంలో కేవలం 30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన ముకుల్‌ను లక్నో ఏకంగా రూ. 2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే తనేంటో నిరూపించుకున్న ఈ రాజస్థాన్ డైమండ్ త్వరలోనే టీమిండియా జెర్సీలో మెరవడం ఖాయమని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు సృష్టించాడు..
ఐపీఎల్ చరిత్రలో డెత్ ఓవర్లలో (16-20 ఓవర్ల మధ్య) 52 పరుగులు చేసిన ఘ‌న‌త ముకుల్ చౌద‌రి సాధించాడు. లక్ష్య ఛేదనలో డెత్ ఓవర్లలో 50కి పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ముకుల్ చరిత్రకెక్కాడు. గతంలో 2013లో కీరన్ పొలార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 57 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ముకుల్ మళ్లీ ఆ ఘనతను పునరావృతం చేశాడు.

ఒక‌ట‌నుకుంటే.. మ‌రొక‌టి
నిజానికి ముకుల్ తొలుత వికెట్ కీపింగ్ వైపు ఆసక్తి చూపించలేదు. మీడియా ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించాడు. కానీ ఓ మ్యాచులో అతడి జట్టుకు వికెట్ కీపర్ అవసరం ఏర్పడింది. దీంతో అతడు కీపింగ్ గ్లౌజు చేతబట్టి.. వికెట్ల వెనక నిల్చున్నాడు. అప్పడి నుంచి అతడు వెనక్కి తిరిగి చూడలేదు. క్రమంగా వికెట్ కీపర్, బ్యాటర్‌గా అతడు స్థిరపడ్డాడు.

దేశవాళీ క్రికెట్‌లో…
ముకుల్ చౌదరి రాజస్థాన్‌కు చెందినవాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన అతడు దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల అండర్-23 లెవెల్‌లో సత్తాచాటాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-2026లో ఐదు ఇన్నింగ్స్‌లలో సుమారు 200 స్ట్రైక్ రేటుతో 173 రన్స్ స్కోరు చేశాడు. జనవరి 2023లో రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డెబ్యూ చేశాడు. గతేడాది డిసెంబర్‌లో లిస్ట్-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

Leave a Reply