రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

  • డివిజనల్ సెక్రటరీ రవీందర్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ పి. రవీందర్ తెలిపారు.

గురువారం పట్టణంలోని రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ తొలి బీఈసీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్రాంచ్ చైర్మన్ ఎస్. నాగరాజు, సెక్రటరీ జీ. సాంబశివుడు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

లోకో పైలట్ వెయిటింగ్ హాల్ (క్రూ లాంజ్) నిర్మాణం, ఇంజినీరింగ్ పీడబ్ల్యూఐ కార్యాలయాల్లో మినీ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు, లోకో పైలట్ లాబీ ఆర్వో ప్లాంట్ మరమ్మతులు, బెల్లంపల్లి క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి వంటి అంశాలను పరిష్కరించాలని కోరారు.

అలాగే రైల్వే క్వార్టర్స్ వెనుక డ్రైనేజ్ కాలువ నిర్మాణం, కాలనీలో క్వార్టర్స్ మరమ్మతులు, మంచిర్యాల పాయింట్స్‌మెన్‌కు ఎనిమిది గంటల పని విధానం అమలు, మంచిర్యాలలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం వంటి సమస్యలను కూడా వినిపించారు.

ఈ సమస్యలను త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని డివిజనల్ సెక్రటరీ రవీందర్ హామీ ఇచ్చారు. బెల్లంపల్లి బ్రాంచ్‌కు సంబంధించిన అన్ని సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు నవనీత్, బెల్లంపల్లి బ్రాంచ్ ట్రెజరర్ షేక్ మీనా, ఇతర ఆఫీస్ బేరర్లు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply