దినపత్రిక కార్యాలయం ముందు వైసీపీ భారీ నిరసన

దినపత్రిక కార్యాలయం ముందు వైసీపీ భారీ నిరసన

మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : ఒక ఛానల్‌లో ప్రసారమైన కొత్త పలుకు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా వారి భార్యలపై చేసిన అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని సంబంధిత దినపత్రిక కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వేలాది మంది పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

మీడియా ముసుగులో రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను, మహిళలను కించపరచడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మేరుగు నాగార్జున ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, రేపల్లె నియోజకవర్గ నేత పిటా నాగమోహన్ కృష్ణ, అద్దంకి నియోజకవర్గ నేత చింతలపూడి అశోక్ కుమార్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

వీరితో పాటు జిల్లాలోని అన్ని మండలాల జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, బాపట్ల వైసిపి నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎస్సీ సెల్ లీడర్ ఇనగలూరి మాల్యాద్రి, జోషి కాంతి, కోకి రాఘవరెడ్డి, చల్ల రామయ్య, గవిని శ్రీనివాసరావు, వాసుమల్ల వాసు, మహిళా విభాగం అధ్యక్షురాలు అశ్విని రెడ్డి, సోషల్ మీడియా ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప, కుటుంబ సభ్యులను లాగడం సంస్కారం కాదని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. తక్షణమే సదరు మీడియా సంస్థ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply