ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం
ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అభ్యుదయ ప్రాథమిక ఉన్నత పాఠశాల (ఏయుపిఎస్) ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాఠశాల భవనం కొంతకాలంగా శిథిలావస్థకు చేరుకుని విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిందన్నారు. పైకప్పు పెచ్చులూడటం, వర్షాకాలంలో స్లాబ్ కారడం, గోడలు బలహీనపడటం వంటి సమస్యలతో తరగతి గదులు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన పట్టణానికి చెందిన దాత ఎస్.రాజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలను దత్తత తీసుకుని, స్వంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టారని పేర్కొన్నారు.

పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడుతూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని, పట్టణ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సేవాభావంతో పనిచేసే వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కులమత భేదాలు లేకుండా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, ఎంఈఓ జీవన్ కుమార్, తాసిల్దార్ సైదులు, పాఠశాల అధ్యాపకు బృందం, స్థానిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

