ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి
- ఎమ్మెల్యే జారే
దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి చేరాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు . ప్రజాపాలన , ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభల నేపథ్యంలో దమ్మపేట మండలంలోని పలు గ్రామపంచాయతీలలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దమ్మపేటలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడం గ్రామ సభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పారదర్శకంగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు .దమ్మపేట మండల కేంద్రం అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో దమ్మపేటకు కమ్యూనిటీ హాలు , బస్టాండ్ అభివృద్ధి ,చెరువు అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

దమ్మపేట మండల కేంద్రాన్ని సుందరంగా తీర్చి దిద్దాల్సిన భాద్యత అధికారులు, ప్రజాప్రతినిధులపైన ఉందన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ గ్రామంలో వున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల అభిప్రాయాలను సేకరించి, తదనుగుణంగా అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు. దమ్మపేట ను అభివృద్ధి పధంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. దమ్మపేట బస్టాండ్ లో పెట్రోల్ బంక్ నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని తీర్మానించటం జరిగింది . దమ్మపేటలో సీసీ కెమెరాలు, డ్రైనేజీ, పంచాయితీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం, లైబ్రరీ, శ్మశానవాటికకు ప్రహరీ గోడ, అర్హులైనవారికి ఇందిరమ్మ ఇళ్ళు, అంగన్వాడీలకు భవనాలు తదితర అంశాలు తీర్మానించటం జరిగింది .
పెట్రోల్ బంక్ వద్దు – బస్టాండ్ ముద్దు..
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా దమ్మపేటలో గురువారం జరిగిన గ్రామసభలో ప్రధానంగా బస్టాండ్ లో పెట్రోల్ బంక్ నిర్మాణంపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో గ్రామస్తులందరూ ముక్త కంఠంతో బస్టాండ్ లో పెట్రోల్ బంక్ నిర్మాణం నిలిపివేయాలని , బస్టాండ్ ను పునరుద్ధరించి, ప్రతి బస్సు దమ్మపేట బస్టాండ్ కు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, ట్రాన్స్కో ఏఈ సాయి కిరణ్, వెటర్నరీ డాక్టర్ తేజా రాణి, ఏఈవో దీప్తి, పిహెచ్సి వైద్యులు మణిదీప్, పంచాయితీ కార్యదర్శి బండి అనంత్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు .
