వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై రాజీ లేదు…

వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై రాజీ లేదు…
లోపాలపై కఠిన చర్యలు తప్పవు – కలెక్టర్ హెచ్చరిక.
బాల్య వివాహాలకు చెక్… చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచన
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంక్షేమ శాఖల అధికారులను హెచ్చరించారు. బుధవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వెనుకబడిన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్‌లోని కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఎండిపోయిన పచ్చిమిర్చి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు. భోజనం, విద్య, వసతి వంటి అంశాలపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నదని, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా, ఆహారం నాణ్యత ఎలా ఉంది, సరిపడా ఇస్తున్నారా అని ఆరా తీశారు. వారానికి ఎన్ని గుడ్లు ఇస్తున్నారు, చిక్కీలు వంటి పోషకాహారం అందుతున్నదా, త్రాగునీటి వసతి, టాయిలెట్ల పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి దశ జీవితం నిర్మాణానికి పునాది వంటిదని పేర్కొంటూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని ప్రోత్సహించారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తూ, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే ఉపాధ్యాయులు లేదా వార్డెన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జీవితంలో స్థిరత్వం సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని, క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఎంపీడీవో మణి మంజరి తదితరులు పాల్గొన్నారు.
