జిల్లా అభివృద్ధికి నిర్విరామ కృషి

జిల్లా అభివృద్ధికి నిర్విరామ కృషి
కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచేలా శాశ్వత అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
శుక్రవారం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద విశాఖ–గుణుపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ప్రయోగాత్మక హాల్ట్‌ను ఈ ఇద్దరు మంత్రులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో రైలు నిలుపుదల వల్ల స్థానిక ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే స్టేషన్‌కు అనుసంధాన రహదారులను విస్తరించి, సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెంపు, కొత్త హాల్ట్‌ల ఏర్పాటు ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఇంజంపాడు గ్రామ రహదారుల అభివృద్ధితో పాటు గరీబుల గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టి తీరప్రాంత ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. కోటబొమ్మాళి రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు కృషి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
గంగరాం నుంచి కోటబొమ్మాళి వరకు రహదారి, నందిగామ మండలం రౌతుపురం రహదారి అభివృద్ధికి రైల్వే అధికారులు సహకరించాలని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహరను కోరారు. టెక్కలి పట్టణంలోని పాత జాతీయ రహదారి రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు డబుల్ రైల్వే గేటు ఏర్పాటు చేయాలని సూచించారు.
హరిశ్చంద్రపురం రైల్వే హాల్ట్ మంజూరు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహర, సీనియర్ డివిజన్ ఇంజనీర్ ఏ.కె. మహారనా, సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.పి. దూభే, ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తి, కోటబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
