నకిలీ కలుపు మందుతో వరి పంటకు నష్టం

నకిలీ కలుపు మందుతో వరి పంటకు నష్టం

వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించిన బాధితుడు

తొర్రూరు,ఆంధ్రప్రభ : నకిలీ కలుపు మందు పిచికారి చేయడంతో వరి పంటకు నష్టం వాటిల్లిన ఘటన జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై బాధితులు శనివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా చైర్మన్ వింజమూరి సుధాకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

బాధితులు తెలిపిన వివరాల మేరకు….మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోడా తండాకు చెందిన రైతు బోడ రామ్ సింగ్ తనకున్న 5 ఎకరాల పొలంలో వరి పంట వేశాడు.కలుపు నివారణ నిమిత్తం తాజాగా మహబూబాబాద్ లోని శ్రీ రాజరాజేశ్వరి ఎరువుల దుకాణంలో కలుపు మందు కొనుగోలు చేసి ఐదు ఎకరాల్లో పిచికారీ చేశాడు.

కలుపు నివారణ జరగకపోగా వరి గింజ పోసుకునే దశలోనే పూర్తిగా ఎండిపోయింది. నకిలీ కలుపు మందు పిచికారి చేయడం వల్ల రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని రైతు కన్నీరు మున్నీరయ్యాడు.
తనకు జరిగిన అన్యాయంపై తగు న్యాయం చేయాలని డిసిఐసి చైర్మన్ ను కోరారు.

ఈ సందర్భంగా డిసిఐసి జిల్లా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ… లైసెన్స్ లేని దుకాణదారులు లేదా డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయకూడదన్నారు. కొనుగోలు చేసిన మందులకు బిల్లులు తప్పకుండా తీసుకోవాలని,పురుగు మందు డబ్బాపై లేబుల్ ఉందో లేదో గమనించాలన్నారు.

లేబుల్ లేనివాటిని కొనుగోలు చేయవద్దని,లేబుల్ తో పాటు సీసాపై ప్రకటించిన పేరు, మందు శాతం, పరిమాణం, విష ప్రభావాన్ని సంబంధించిన సూచనలు,పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనించాలన్నారు. బాధిత రైతుకు నష్టపరిహారం కంపెనీ నుండి అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply