hero| సెమీస్‌లో సంజూ, బుమ్రా హీరోలు

hero| సెమీస్‌లో సంజూ, బుమ్రా హీరోలు
- బ్యాటింగ్‌లో ఒకరు.. బౌలింగ్‌లో మరొకరు
- ఇద్దరు విజృంభించడంతో ఫైనల్ చేరిన భారత్
- సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు
- ఇషాన్ కిషన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం
- చివరి ఓవర్లలో దూబె, హార్దిక్ మెరుపులు
- బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు కళ్లెం
- సెమీస్‌లో విజయం… ఫైనల్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఘన విజయం సాధించడంలో ఇద్దరు మొనగాళ్లే కారణం. వారిద్దరిలో ఒకరు సంజూ శాంసన్ కాగా, మరొకరు బుమ్రా. వీరిద్దరు విజృంభించడంతో భారత్ సెమీ ఫైనల్లో గట్టెక్కింది. లేదంటే విజయం కష్టమయ్యేది. సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేయడానికి దోహదపడ్డాడు. అలాగే బుమ్రా ఎప్పటిలాగే తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేశాడు.

టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించిందంటే ప్రధాన కారణం శాంసన్ అదిరే బ్యాటింగే. చెలరేగి ఆడిన అతడు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు ఇంగ్లాండ్ చింతించేలా చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ మాత్రం పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ రెండో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. కానీ శాంసన్ జోరును అతడి నిష్క్రమణ ఆపలేకపోయింది. పేసర్ ఆర్చర్ ఊహించినట్లే షార్ట్ బంతులతో అతణ్ని పరీక్షించాడు. కానీ ఆ బంతులను శాంసన్ అలవోకగా ఎదుర్కొన్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతడి షార్ట్ బంతికి ఫైన్ లెగ్‌లోకి సిక్స్ కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆర్చర్ స్లో బంతులకూ శాంసన్ పడలేదు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన శాంసన్.. అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్నాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ సాగిపోయాడు. 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 9వ ఓవర్లోనే స్కోరు వంద దాటింది. తర్వాతి ఓవర్లో ఇషాన్ ఔట్ కావడంతో 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడ్డా.. దూబెతో కలిసి మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు శాంసన్. శాంసన్‌తో పాటు దూబె కూడా ధాటిగా ఆడడంతో 13 ఓవర్లలో 160/2తో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో శాంసన్ నిష్క్రమించినా.. దూబె, తిలక్ (21), హార్దిక్ (27) బ్యాట్ ఝళిపించడంతో ఆఖరి అయిదు ఓవర్లలో భారత్ 86 పరుగులు రాబట్టింది.

బుమ్రా అద్భుత బౌలింగ్
బుమ్రా అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గట్టెక్కించాడు. 16వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చిన అతడు.. తర్వాతి ఓవర్లో అర్ష్‌దీప్ 16 పరుగులిచ్చి జట్టును ఇబ్బందిలో నెట్టాక మళ్లీ గొప్పగా బౌలింగ్ చేశాడు. బెతెల్, కరన్‌లకు కళ్లెం వేస్తూ 18వ ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అక్కడితో అతడి బౌలింగ్ కోటా పూర్తయింది. ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు అవసరమైనా.. బెతెల్ క్రీజులోనే ఉండడంతో ఇంగ్లాండ్ రేసులోనే ఉంది. 19వ ఓవర్లో హార్దిక్ తొలి బంతికే సిక్స్ కొట్టి బెతెల్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే హార్దిక్ తర్వాతి అయిదు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చి కరన్‌ను వెనక్కి పంపాడు. ఆఖరి ఓవర్లో (దూబె) ఇంగ్లాండ్‌కు 30 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే బెతెల్ రనౌటయ్యాడు. తర్వాతి రెండు బంతుల్లో దూబె రెండు పరుగులే ఇవ్వడంతో భారత్ విజయం ఖాయం కాగా.. చివరి మూడు బంతులకు ఆర్చర్ సిక్సర్లు బాదేశాడు.
