రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి.

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : మామిడి పంట తెగుళ్లు బారిన పడి నష్టం పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డిగూడెం మండలంలో మామిడి తోటలను ఆదివారం నాడు రైతు సంఘం నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అమర్ భవన్ లో యం మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా లో సుమారు గా ఒక లక్ష ఇరవై వేలకు పైగా ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తున్న రైతులు పండించిన పంట నల్ల దోమ, పేలు బారిన పడి పూర్తి గా దెబ్బతిన్న పరిస్థితి కనిపించడం జరిగిందని, పంట నాణ్యత లేకపోతే బారీ నష్టాలు గ్రహించిన రైతు మామిడి చెట్లను నరికేస్తున్నారని తెలిపారు.

లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గత సంవత్సరం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ చేపించాలంటే ఇలాంటి పంటలకు ఎలా చేసేది అనే సందేహంలో రైతులు ఉన్నారని తెలిపారు. అలాగే ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు సరైన అవగాహన కల్పించాలని, మామిడి పంటకు వస్తున్న ఈ తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. మామిడి పంటకు ప్రత్యమ్నాయంగా వేసే పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మామిడి పంటకు నల్ల పేను వలన తీవ్రమైన నష్టం జరుగుతుందనీ, కానీ నేటికి కూడా పరిష్కారం లభించలేదని అన్నారు. ఈ సంవత్సరం మామిడి పూర్తి దెబ్బతిన్నదనీ కనుక అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని, మామిడి పంటను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వి ఆంజనేయులు పండ్ల తోటల పెంపకం దార్ల సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకులు వీరారెడ్డి, ధనలక్ష్మి, వి వెంకటరెడ్డి, కొండపల్లి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply