ఇది అందరికీ ప్రయోజనకరం

ఇది అందరికీ ప్రయోజనకరం
కృష్ణానది పక్కన నేషనల్ హైవే ప్రతిపాదనలు ప్రతిబంధకమే
ఇప్పటికే ఉన్న నేషనల్ హైవే విస్తరణ చేపట్టండి
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్.హెచ్ 65) ఆరు వరుసల మార్గం విస్తరణకు సంబంధించి పరిటాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు కృష్ణానదికి పక్కనే నిర్మించాలనే నూతన ప్రతిపాదనలు అందరికీ ప్రతిభంధకమేనని మైలవరం ఎమ్మెల్యే వసంతం వెంకట కృష్ణప్రసాద్ విముఖత వ్యక్తం చేశారు. విజయవాడలో డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)పై గురువారం ప్రజాప్రతినిధులతో జాతీయ రహదారి విభాగం అధికారులు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వసంత మాట్లాడారు. కృష్ణానది పక్కనే నేషనల్ హైవే ఆరు వరుసలుగా రహదారి ప్రతిపాదనల కారణంగా నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కనే ఏర్పాటు చేయనున్న ఈ రహదారి ప్రతిపాదనల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పటికే నూతన రైల్వే లైను ప్రతిపాదనల వల్ల ఈ ప్రాంతంలో రైతాంగం భూములు కోల్పోయి నష్టపోయిందన్నారు. గతంలో బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్, కృష్ణానదికి 11 లక్షల క్యూసెక్కుల వరదల వల్ల ఈ ప్రాంతంలో ఇప్పటికే కృష్ణా నదికి చాలాదూరంలో ఉన్న జాతీయ రహదారిపైకి వరద నీరు పోటెత్తి చాలాసార్లు రహదారిపై ప్రయాణానికి ఆటంకాలు కలిగినట్లు వెల్లడించారు. మళ్లీ కృష్ణానదికి పక్కనే ఆరు వరుసల హైవే నిర్మిస్తే వరదల సమయంలో మరింత నష్టం కలుగుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోనే ఈ కొత్త ప్రతిపాదనలు ఎందుకు అని ప్రశ్నించారు.
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలోని పరిటాల నుంచి మూలపాడు, ఇబ్రహీంపట్నం వరకు ఉన్న ఇప్పటికే ఉన్న జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరణ చేపట్టి బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట మరింత ఎక్కువ భూమిని సేకరించి మలుపులు సరి చేయాలన్నారు. ఇదే అందరికీ ప్రయోజన కరమన్నారు. దీనిపైనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు దృష్టి సారించి, ఉన్న రహదారినే ఆరు వరుసలుగా హైవే విస్తరణ చేపట్టాలని సూచించారు.
