రక్తదానం.. ప్రాణదానంతో సమానం

రక్తదానం.. ప్రాణదానంతో సమానం
- బెల్లంపల్లిలో జనహిత సేవా సమితి సేవలు అభినందనీయం
- మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి
- మెగా శిబిరంలో 102 యూనిట్ల రక్తం సేకరణ..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అన్ని దానాల్లోకన్న రక్తదానం అత్యంత గొప్పదనిబెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి-రమేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని తాపీ సంఘ భవనంలో జనహిత సేవా సమితి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని ఆమె జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. జనహిత సేవా సమితి సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మున్సిపల్ కౌన్సిల్ తరపున ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎల్లవేళలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రక్తం దొరక్క ఇబ్బంది పడే నిరుపేదలకు ఈ రక్తం ప్రాణాధారమవుతుందని పేర్కొన్నారు. సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. తలసేమియా, డయాలసిస్ పేషెంట్స్ కోసం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మెగా శిబిరంలో రక్త దాతల నుండి మొత్తం 102 యూనిట్ల రక్త సేకరణ జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, సభ్యులు కాసర్ల శ్రీనివాస్ , కౌన్సిలర్లు బండారి స్రవంతి, నిచ్చకోల వంశీ, చంద్రవెళ్లి గ్రామ సర్పంచ్ చిలుముల శ్రీనివాస్ తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దావ రమేష్, శంకర్ సింగ్, పోలు శ్రీనివాస్, గాలి శ్రీనివాస్, దామెర శ్రీనివాస్, బీజేపీ నాయకులు పట్టి వెంకటకృష్ణ, గజేల్లి రాజ్ కుమార్, జనహిత సేవా సమితి సభ్యులు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
