POCSO COURT | మూడేళ్ల కఠిన కారాగార శిక్ష..

POCSO COURT | మూడేళ్ల కఠిన కారాగార శిక్ష..
- నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో నేరం రుజువు
- రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధింపు
POCSO COURT | పాయకాపురం, ఆంధ్ర ప్రభ : విజయవాడ నగరంలో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించి నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నేరం రుజువైన నేపథ్యంలో నిందితుడిపై కోర్టు రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే… నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్.బి.ఎస్. నగర్లో నివసించే 17 ఏళ్ల బాలిక కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన గోగులమూడి అశోక్ చక్రవర్తి అలియాస్ అశోక్ (23) పలుమార్లు ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడు. పెద్దలు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోకుండా బాలికను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాలిక ఫిర్యాదు మేరకు నున్న పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 434/2014గా కేసు నమోదు చేసి, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం స్టాకింగ్, అడ్డుకోవడం, బెదిరింపుల సెక్షన్లతో పాటు బాలల లైంగిక రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అప్పటి ఎస్.ఐ. జయచంద్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం 2014 నవంబర్ 7న నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి, చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువవడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీమతి వేల్పుల భవాని మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో అభియోగ పక్షం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది గడ్డం రాజేశ్వరరావు వాదనలు వినిపించగా, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావు, నున్న ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ పర్యవేక్షణలో ఐదుగురు సాక్షులను విచారించారు. బాలికకు న్యాయం దక్కిందని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
